బలహీన భారత్‌గా మారుస్తామంటే ఊరుకోం

భాజపా, ఆరెస్సెస్‌ దేశంలో ద్వేషం, హింసా ప్రవృత్తులను ప్రేరేపిస్తూ ప్రజల దృష్టి ప్రధాన సమస్యలపైకి వెళ్లకుండా చూస్తుంటాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. దేశాన్ని బలహీన భారత్‌గా మారుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని

Updated : 25 Sep 2022 06:18 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ

త్రిస్సూర్‌ : భాజపా, ఆరెస్సెస్‌ దేశంలో ద్వేషం, హింసా ప్రవృత్తులను ప్రేరేపిస్తూ ప్రజల దృష్టి ప్రధాన సమస్యలపైకి వెళ్లకుండా చూస్తుంటాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. దేశాన్ని బలహీన భారత్‌గా మారుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇంధనం, వంటగ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్‌ జోడోయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక థెక్కిన్‌కాడు మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ ఏమి చేసిందని ప్రధాని తరచూ ప్రశ్నిస్తుంటారని.. ఆయనలా తాము ఈ స్థాయిలో నిరుద్యోగం, ధరలు పెంచలేదన్నారు. దేశంలోనే అత్యధిక పట్టణ నిరుద్యోగ రేటు కేరళలో ఉందని, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ సమస్యపై తక్షణం దృష్టి సారించాలని రాహుల్‌ కోరారు.

భాగవత్‌ మసీదు సందర్శన నటన : జైరాం రమేశ్‌

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’తో భాజపా, ఆరెస్సెస్‌ వణుకుతున్నాయనీ, అందుకే ఆరెస్సెస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌ ఇటీవలి కాలంలో వివిధ వర్గాలవారి వద్దకు వెళ్తున్నారని  సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ చెప్పారు. ఇటీవల భాగవత్‌ ఓ మసీదును సందర్శించినా అదంతా నటన అనీ, అసలైన విషయాలపై ఆయన మౌన మంత్రం జపిస్తుంటారని విమర్శించారు. రాహుల్‌ ఈ యాత్ర తలపెట్టడానికి కారణం ఎన్నికలు కానేకాదని స్పష్టం చేశారు.


రాహుల్‌ యాత్రకు హాలీవుడ్‌ నటుడి మద్దతు

లాస్‌ఏంజెలిస్‌: రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్రకు హాలీవుడ్‌ నటుడు జాన్‌ కుసాక్‌ మద్దతు ప్రకటించారు. ఫాసిస్టులకు వ్యతిరేకంగా ఎక్కడ పోరాటం జరిగినా తాను సంఘీభావం ప్రకటిస్తానని ట్వీట్‌ చేశారు. గతంలో రైతుల ఆందోళనకూ ఆయన మద్దతు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని