సోనియాతో నీతీశ్‌, లాలూ భేటీ

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ దిల్లీలో ఆదివారం భేటీ అయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష

Published : 26 Sep 2022 04:11 IST

విపక్షాల ఐక్యతపై చర్చించామన్న బిహార్‌ సీఎం

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ దిల్లీలో ఆదివారం భేటీ అయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడం గురించి వారు చర్చించారు. కాంగ్రెస్‌కు, ఆ పార్టీని ఇన్నాళ్లూ వ్యతిరేకిస్తూ వచ్చిన కొన్ని ప్రాంతీయ పార్టీలకు మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని సమాచారం. ఈ ఏడాది ఆగస్టులో కమలదళంతో బంధాన్ని నీతీశ్‌ (జేడీయూ) తెంచుకున్నారు. ఆ తర్వాత సోనియాతో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ క్రియాశీల రాజకీయ భేటీలో పాల్గొనడమూ చాన్నాళ్ల తర్వాత ఇదే మొదటిసారి. సోనియాతో సమావేశం అనంతరం నీతీశ్‌ మాట్లాడుతూ.. భాజపాను ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలని విస్తృతస్థాయిలో అంగీకారం కుదిరిందని పేర్కొన్నారు. అందుకు అవసరమైన నిర్దిష్ట ప్రణాళికను కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల అనంతరం రూపొందించనున్నట్లు తెలిపారు. ఆ పార్టీలో వ్యవస్థాగత ఎన్నికలు పూర్తయ్యాక.. విపక్షాల ఐక్యతపై సమాలోచనలు కొనసాగిస్తామని చెప్పారు. బిహార్‌లో మాదిరిగా భాజపాను కేంద్రంలోనూ గద్దె దించాలని లాలూ వ్యాఖ్యానించారు. ‘‘మేమంతా ఐకమత్యంగా ఉన్నాం. కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీ. కాబట్టి చొరవ తీసుకొని.. 2024లో భాజపా పాలనకు చరమగీతం పాడే విషయంపై చర్చించాలని సోనియాకు చెప్పాం. తమ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సంగతిని ఆమె మాకు గుర్తుచేశారు. అవి పూర్తయ్యాక.. కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడితో సమావేశమై సమాలోచనలు కొనసాగిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts