స్థానిక ఉత్పత్తులను కొనండి

ప్రస్తుతం ప్రధాన పండగల సీజన్‌ రాబోతోందని, ఈ సమయంలో దేశ ప్రజలంతా స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చి వాటిని అత్యధిక స్థాయిలో కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ

Published : 26 Sep 2022 06:24 IST

మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పిలుపు

కాకినాడ, గోవా ప్రజలపై ప్రశంసలు

ఈనాడు, దిల్లీ : ప్రస్తుతం ప్రధాన పండగల సీజన్‌ రాబోతోందని, ఈ సమయంలో దేశ ప్రజలంతా స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చి వాటిని అత్యధిక స్థాయిలో కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మన్‌కీబాత్‌ కార్యక్రమం ద్వారా మాట్లాడుతూ పండగల సమయంలో ఇచ్చే బహుమతుల్లో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ‘‘రాబోయే పండగల సీజన్‌లో ఖాదీ, చేనేత, హస్తకళల ఉత్పత్తుల కొనుగోళ్లలో ఇదివరకున్న రికార్డులన్నీ బద్దలు కొట్టాలి. ప్లాస్టికేతరాలైన జనుము, నూలు, అరటినార లాంటి సంప్రదాయ వస్తువులతో తయారు చేసిన బ్యాగ్‌ల వినియోగాన్ని పెంచాలి. ప్రతి ఒక్కరూ ఒక టీబీ రోగిని దత్తత తీసుకొని వారికి పౌష్టికాహారం అందించేందుకు ప్రయత్నించాలి’’ అని మోదీ సూచించారు.

మోదీ ప్రకటనను స్వాగతించిన మాన్‌
చండీగఢ్‌ విమానాశ్రయానికి షహీద్‌ భగత్‌ సింగ్‌ పేరు పెడుతూ ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్‌లో చేసిన ప్రకటనను పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ స్వాగతించారు. పంజాబ్‌ ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని తెలిపారు.

రెండు నెలల్లో 30 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ
తీరప్రాంతాలన్నింటినీ శుభ్రంగా మార్చేందుకు జులై 5న ప్రారంభించిన స్వచ్ఛసాగర్‌... సురక్షిత్‌సాగర్‌ కార్యక్రమం ఈ నెల 17న విశ్వకర్మ జయంతిరోజు ముగిసింది. అది తీరప్రాంతాల శుభ్రత దినోత్సవం కూడా. ఈ రెండున్నర నెలల కాలంలో సుమారు 5వేల మంది యువ ఎన్‌ఎస్‌ఎస్‌ స్వచ్ఛంద సేవకులు తీరాల నుంచి 30 టన్నులకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా గోవా, కాకినాడల్లో ప్రజలు మానవగొలుసుగా ఏర్పడి ప్లాస్టిక్‌ వల్ల కలిగే ప్రమాదం గురించి అవగాహన కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని