థర్డ్‌ ఫ్రంట్‌ కాదు.. ప్రధాన ఫ్రంట్‌ కావాలి

భాజపాను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌, వామపక్షాలు సహా విపక్ష పార్టీలన్నీ కలిసి ‘ప్రధాన ఫ్రంట్‌’గా ఏర్పడాలని బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. అలా ఏకమైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో

Published : 26 Sep 2022 06:03 IST

కాంగ్రెస్‌, వామపక్షాలు సహా విపక్షాలన్నీ ఏకమవ్వాలి

ఫతేహాబాద్‌ మెగా ర్యాలీలో విపక్ష నేతల ఆకాంక్ష

ఫతేహాబాద్‌: భాజపాను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌, వామపక్షాలు సహా విపక్ష పార్టీలన్నీ కలిసి ‘ప్రధాన ఫ్రంట్‌’గా ఏర్పడాలని బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. అలా ఏకమైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కమలదళం చిత్తుగా ఓడుతుందని జోస్యం చెప్పారు. థర్డ్‌ ఫ్రంట్‌ (భాజపాయేతర, కాంగ్రెసేతర పార్టీలతో) ఏర్పాటు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మాజీ ఉప ప్రధానమంత్రి దేవీలాల్‌ జయంతిని పురస్కరించుకొని ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) పార్టీ హరియాణాలోని ఫతేహాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మెగా ర్యాలీలో నీతీశ్‌ ప్రసంగించారు. రాజకీయ లబ్ధి కోసం హిందువులు, ముస్లింల మధ్య భాజపా కలహాలు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. నిజానికి సమాజంలో ఆ రెండు వర్గాల మధ్య ఘర్షణ లేనే లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, వామపక్షాలు లేని విపక్ష కూటమిని ఊహించుకోవడం కష్టమని నీతీశ్‌ అన్నారు. వాటన్నింటినీ కలుపుకొనిపోదామంటూ సహచర పార్టీల నేతలకు పిలుపునిచ్చారు. హస్తం పార్టీపై సుదీర్ఘకాలం పోరాడిన ఐఎన్‌ఎల్‌డీ, శిరోమణి అకాలీదళ్‌ పార్టీల నేతలు వేదికపై ఉండగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ర్యాలీ అనంతరం విలేకర్లతో మాట్లాడిన నీతీశ్‌.. ప్రధానమంత్రి పదవికి తాను పోటీలో లేనని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో భాజపాను గద్దె దించేందుకు ప్రతిఒక్కరూ ఇప్పటినుంచే కలిసి పనిచేయాలని శరద్‌ పవార్‌ పిలుపునిచ్చారు.

ఎన్డీయే లేనే లేదు: తేజస్వీ యాదవ్‌
దేశంలో ప్రస్తుతం ఎన్డీయే లేనే లేదని ఆర్జేడీ అగ్రనేత-బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే ఆ కూటమి నుంచి జేడీయూ, శిరోమణి అకాలీదళ్‌, శివసేన బయటికొచ్చాయని పేర్కొన్నారు. అబద్ధాల పార్టీ అంటూ భాజపాపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ తరఫున ర్యాలీకి ఎవరూ హాజరుకాలేదు. తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలూ దానికి దూరంగా ఉన్నాయి.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts