రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం

అనూహ్య రీతిలో రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆదివారం అర్ధరాత్రి దాకా హైడ్రామా కొనసాగింది. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న

Updated : 26 Sep 2022 09:47 IST

మూకుమ్మడి రాజీనామాకు సిద్ధపడిన 92 మంది ఎమ్మెల్యేలు!

సీఎల్పీ సమావేశానికి డుమ్మా.. లేఖలతో స్పీకర్‌ వద్దకు..

సచిన్‌ పైలట్‌కు పగ్గాలు ఇచ్చేందుకు గహ్లోత్‌ ససేమిరా

జైపుర్‌: అనూహ్య రీతిలో రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆదివారం అర్ధరాత్రి దాకా హైడ్రామా కొనసాగింది. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌.. సీఎంగానూ తానే కొనసాగాలని మొండికేయడం ఈ సంక్షోభానికి అసలు కారణం. యువనేత సచిన్‌ పైలట్‌కు సీఎం కుర్చీ ఇచ్చేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. అందుకు మద్దతుదారులు వంతపలుకుతున్నారు. అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువచ్చే ఉద్దేశంతో.. గహ్లోత్‌కు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేసేందుకు 92 మంది ఎమ్మెల్యేలు సిద్ధపడినట్లు సమాచారం. ఇందులో కొందరు స్వతంత్ర సభ్యులూ ఉన్నారు. వీరంతా బస్సుల్లో శాసనసభ స్పీకర్‌ సి.పి.జోషి నివాసానికి వెళ్లారు. రాజీనామా లేఖలను అందజేశారా లేదా అనేది మాత్రం రాత్రి పొద్దుపోయేవరకు స్పష్టంకాలేదు. వీరు కాంగ్రెస్‌ శాసన సభాపక్షం (సీఎల్పీ) సమావేశానికీ హాజరుకాలేదు. అధిష్ఠానం పరిశీలకులుగా జైపుర్‌ వచ్చిన మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మాకన్‌లు చాలాసేపు వేచి చూసినా ఎమ్మెల్యేలు రాకపోవడంతో చివరకు సమావేశం జరగలేదు. తమతో విడివిడిగానైనా వచ్చి మాట్లాడాలని శాసనసభ్యుల్ని ఒప్పించేందుకు అర్ధరాత్రి తర్వాత కూడా వారు ప్రయత్నిస్తున్నారు.

ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారనీ, ఇక తన చేతిలో ఏమీ లేదని అధిష్ఠానానికి గహ్లోత్‌ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనేది తన మదిలో ఉందని అంతకుముందు ఆయన జైసల్మేర్‌లో విలేకరులకు చెప్పడం విశేషం. ఎట్టి పరిస్థితుల్లో గహ్లోత్‌ ప్రాధాన్యం తగ్గకూడదని ఆయన వర్గీయులు గట్టిగా చెబుతున్నారు.

ఏకవాక్య తీర్మానం అనుకుంటే..
ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల్ని గహ్లోత్‌ చేపడితే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించేందుకు ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి నివాసంలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో.. ‘అధిష్ఠాన నిర్ణయమే శిరోధార్యమ’నే ఏకవాక్య తీర్మానాన్ని చేస్తుంటారు. దానికి భిన్నంగా సీఎల్పీ భేటీకి ముందే మంత్రి శాంతి ధారీవాల్‌ నివాసంలో గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు విడిగా సమావేశమయ్యారు. గహ్లోత్‌నే సీఎంగా ఉంచాలనీ, లేదంటే 2020లో సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు జెండా ఎగరేసినప్పుడు సర్కారుకు అండగా నిలిచినవారిలో ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయాలని వీరు పట్టుపట్టారు. దానిలో భాగంగానే తమ రాజీనామా లేఖలను రూపొందించి, ఆ మంత్రికే అందజేశారని ఒక వర్గం చెబుతోంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గహ్లోత్‌, పైలట్‌లను దిల్లీకి రావాల్సిందిగా అధిష్ఠానం ఆదేశించిందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని