యాత్రను అడ్డుకోవడం 5 నిమిషాల పని

విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే మీకొచ్చే నష్టమేంటని మంత్రి బొత్స సత్యనారాయణ మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తున్న నాయకులను నిలదీశారు. ఆదివారం విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి

Updated : 26 Sep 2022 07:10 IST

కానీ ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదు

ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాల్సిందే

వెనకబాటుతనానికి కారకులెవరు?

మంత్రి బొత్స సత్యనారాయణ

ఈనాడు, విశాఖపట్నం: విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే మీకొచ్చే నష్టమేంటని మంత్రి బొత్స సత్యనారాయణ మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తున్న నాయకులను నిలదీశారు. ఆదివారం విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘ఈ ప్రాంతపెద్దలు పడ్డ కష్టాలు నాకు తెలుసు. తినడానికి బియ్యం లేని పరిస్థితి. దివంగత ఎన్టీ రామారావు వచ్చిన తరువాత, రూ.2కు కిలో బియ్యం ఇచ్చాకే బియ్యం తిన్నాం. అప్పటివరకు చోళ్లు, అంబలి తాగేవాళ్లం. 2004లో రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాలు, ఉపాధి హామీ వచ్చాక వలసలు ఆగాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే వచ్చే నష్టమేంటో చెప్పాలి. ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి కారణం ఎవరు? 14 ఏళ్లు సీఎంగా చేసినవారు ఈ ప్రాంతానికి చేసినదేంటి? ఈ ప్రాంతం గురించి సీఎం జగన్‌ ఆలోచిస్తుంటే కక్ష కడుతున్నారు. ఇది క్షమించరానిది. ఇప్పుడు వెనకడుగు వేస్తే మన తల్లిదండ్రులకు, కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్లమవుతాం. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’ అని వివరించారు. ఇక్కడివారు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కావాలనే వారని, అవి ఉంటే వలసలు వెళ్లడానికి అనువుగా ఉంటుందని భావించేవారని తెలిపారు. అమరావతిలో రాజధాని నిర్మిస్తే రాష్ట్ర సంపద మొత్తాన్ని ఆ మట్టిలో పోసే పరిస్థితి ఉండేదని, కర్నూలును న్యాయ రాజధానిగా ఊరికే ప్రతిపాదించలేదని... గతంలో జరిగిన ఒప్పందాలు, రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘కార్యక్రమంలో ఓ మిత్రుడు దండయాత్రతో అడ్డుకుందామని చెబుతున్నారు. అది 5 నిమిషాల పని. ఆత్మాభిమానం విషయం వస్తే ఏ ఒక్కరూ ఆగరు. ఎవరినీ ఆపలేం. ఏ ఒక్కరినీ అడ్డుకోలేం. కానీ మనం బతుకుతున్న వ్యవస్థను గౌరవించుకోవాలి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు తన సహచరుల కోసం రాష్ట్ర సంపదను దోచిపెడతామంటే చూస్తూ ఊరుకుంటే వ్యవస్థ, సమాజం నష్టపోతాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆందోళనలు చేయలేదు. అందుకే నష్టపోయాం. మళ్లీ అలాంటి తప్పిదం జరగకూడదనే ఇక్కడకొచ్చి నా అభిప్రాయం చెబుతున్నా. అది పాదయాత్రా? దండయాత్రా? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సంపాదన కోసం చేస్తున్న యాత్రా? తెలుగుదేశం రాజకీయ యాత్రా? అడ్డుకోవాలంటే ఎంతసేపు? గట్టిగా కళ్లు తెరిస్తే 5 నిమిషాలు. కానీ ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదు’ అని పేర్కొన్నారు. ‘శాసన రాజధాని అక్కడే ఉంటుంది. అక్కడా అధికారులుంటారు. ఇప్పటికే అక్కడ కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి. అయినా మీకొచ్చిన బాధేంటి? ఎందుకు విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా వద్దంటున్నారు? విశాఖలో రూ.5-10వేల కోట్లు ఖర్చుపెడితే ముంబయిని తలదన్నే నగరం తయారవుతుంది. నేనూ 25 ఏళ్లు పదవుల్లో ఉన్నా. దోచుకోవాలనుకుంటే విశాఖలో సగం మా జేబులో ఉండేది. భగవద్గీత మీద ప్రమాణం చేస్తాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాల్సిందే’ అని పేర్కొన్నారు. పరిపాలన రాజధాని రావాలంటూ పెద్ద ర్యాలీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఉన్నత పదవుల్లో, రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉన్నవారు చేసే వ్యాఖ్యలు ఎవరినీ బాధించేలా ఉండకూడదని హితవు పలికారు. పత్రికలు కూడా సంయమనంతో వ్యవహరించాలని, లేకుంటే సహించే ప్రశ్నే లేదన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ వీసీ ఆచార్య లజపతిరాయ్‌ మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు కన్నా ముందు విశాఖ పేరే రాజధానిగా ప్రతిపాదించారని, నాటి అసెంబ్లీలో చర్చ తర్వాత కర్నూలులో ఏర్పడిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాల నాయుడు, పీడిక రాజన్న దొర, మంత్రి అమర్‌నాథ్‌, విశాఖ నగర మేయర్‌ హరివెంకట కుమారి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, పలుసంఘాల నేతలు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts