కోట్లు కుమ్మరించినా ఫలితం శూన్యం

గోవాలో ఎలాగైనా సరే పాగా వేయాలన్న లక్ష్యంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో కలిసి శ్రమించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ భారీగానే చేతిచమురు వదిలించుకుంది. గత శాసనసభ

Published : 26 Sep 2022 04:49 IST

గోవా ఎన్నికల్లో భాజపా కన్నా రెట్టింపు వ్యయం చేసిన తృణమూల్‌

అయినా ఒక్క సీటూ గెల్చుకోలేని దుస్థితి

పారని ‘పీకే’ పాచిక!

దిల్లీ: గోవాలో ఎలాగైనా సరే పాగా వేయాలన్న లక్ష్యంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో కలిసి శ్రమించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ భారీగానే చేతిచమురు వదిలించుకుంది. గత శాసనసభ ఎన్నికల్లో రూ.47.54 కోట్లు ఖర్చు చేసింది. అధికార భాజపా చేసిన వ్యయం(రూ.17.75 కోట్లు)తో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా ఎక్కువ. అయినప్పటికీ తృణమూల్‌ ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది. ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలు ఏమాత్రం కలసిరాలేదు. భాజపా 40 సీట్లకుగానూ 20 సీట్లు గెల్చుకుని స్వతంత్రుల మద్దతుతో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రూ.3.50 కోట్ల వరకు ఖర్చు చేసింది. కాంగ్రెస్‌ సుమారు రూ.12 కోట్లు వెచ్చించింది. గోవా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు ఇటీవల ఎన్నికల సంఘానికి ఈ మేరకు తమ ప్రచార వ్యయం వివరాలను సమర్పించాయి. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఆ పార్టీ కేంద్ర నిధులను ప్రచారానికి వెచ్చించడమే కాకుండా ఎన్నికల బరిలో నిలిచిన తమ 11 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున అందజేసింది. ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులను బరిలోకి దింపిన శివసేన రూ.92 లక్షల వరకు ఖర్చుచేసింది. అయితే, పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడంపై దృష్టిపెట్టిన టీఎంసీ గోవా ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో కలిసి పాచికలు కదిపింది. ఇందుకోసం మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ)తో జతకట్టిన టీఎంసీ.. ఫలితాలకు వచ్చేసరికి మాత్రం చతికిలబడింది. మొత్తం 40 శాసనసభ స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో 23 సీట్లలో టీఎంసీ, 13 స్థానాల్లో ఎంజీపీ అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో టీఎంసీ అభ్యర్థులు ఒక్కరూ గెలుపొందకపోగా.. ఎంజీపీ అభ్యర్థులు ఇద్దరు విజయం సాధించారు. ఆప్‌..  39 మందిని బరిలోకి దింపితే ఇద్దరు గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి 11 మంది గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క సీటు తగ్గడంతో భాజపా.. ఎంజీపీకి చెందిన ఇద్దరు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి సర్కారును ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని