కడప వాళ్లకు భూములు ఇచ్చేయాలని డీఎస్పీ బెదిరింపు

అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ కోర్టు కేసుల్లో ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు చేస్తూ, తన ఉద్యోగాన్ని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

Published : 27 Sep 2022 04:34 IST

అనకాపల్లిలో ఎస్పీ గౌతమి సాలికి తెదేపా నాయకుల ఫిర్యాదు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ కోర్టు కేసుల్లో ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు చేస్తూ, తన ఉద్యోగాన్ని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల తెదేపా ఇన్‌ఛార్జులు ప్రగడ నాగేశ్వరరావు, బత్తుల తాతయ్యబాబు, పి.వి.జె.కుమార్‌తో కలసి సోమవారం ఆయన అనకాపల్లి ఎస్పీ కార్యాలయానికి విచ్చేశారు. స్పందన కార్యక్రమంలో ఎస్పీ గౌతమి సాలికి డీఎస్పీపై ఫిర్యాదు చేసి సమస్యను వివరించారు. అనంతరం అయ్యన్న విలేకరులతో మాట్లాడుతూ... ‘అనకాపల్లి మైనింగ్‌ మాఫియాతో డీఎస్పీ కలిసిపోయారు. కొంతమంది క్వారీ యజమానులు ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మమ్మల్ని కోరారు. ఈ విషయం బయటకు చెబితే లైసెన్స్‌ రద్దు చేస్తారని క్వారీ యజమానులు భయాందోళన చెందుతున్నారు. కోర్టులో ఉన్న భూ వివాదాల్లోనూ డీఎస్పీ తలదూరుస్తూ భూ యజమానులను భయపెడుతున్నారు. గ్రామాల్లో చిన్నచిన్న భూ సమస్యలు వస్తుంటాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే పోలీసులు ప్రవేశించాలే తప్ప నేరుగా ఫోన్లు చేసి డీఎస్పీ బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసం? ఉగ్గినపాలెం రెవెన్యూ పరిధిలోని భూ విషయంపై అనకాపల్లి డీఎస్పీ 24 సార్లు ఫోన్‌ చేసి ఆ భూమిని కడప నుంచి వచ్చిన వారికి రాసేయమని బెదిరిస్తున్నారు...’ అని వివరించారు. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వాటిని అయ్యన్న చూపించారు. డీఎస్పీ అన్ని వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. ఇంతవరకు ఓపిక పట్టామని, దీన్ని తమ చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. డీఎస్పీ తీరుపై అదనపు ఎస్పీ స్థాయి అధికారితో సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్లు అయ్యన్నపాత్రుడు చెప్పారు. దీనికి ఎస్పీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్యక్రమంలో తెదేపా నేతలు మల్లునాయుడు, కోట్ని బాలాజీ, మళ్ల సురేంద్ర, కాయల మురళీ, ఉగ్గిన రమణమూర్తి, సబ్బవరపు గణేష్‌, పోలారపు త్రినాథ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని