జగన్‌ 3 రాజధానుల నిర్ణయం తప్పు

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాలని ఆ రాష్ట్ర సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) పేర్కొన్నారు. మూడుచోట్ల రాజధానులతో....

Updated : 27 Sep 2022 10:03 IST

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదు
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాలని ఆ రాష్ట్ర సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) పేర్కొన్నారు. మూడుచోట్ల రాజధానులతో అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టంచేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృత దృక్పథంతోనే అమరావతి పేరు పెట్టారన్నారు. ఏపీకి అమరావతియే రాజధానిగా ఉండాలని కాంగ్రెస్‌ నిర్ణయంలోనూ ఉందని తెలిపారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాలులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ‘‘ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు. అధికారంలో లేనప్పుడు ఎలా నడుచుకున్నా ఎవరూ పట్టించుకోరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పని చేసినా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఎన్టీఆర్‌ పేరు తీసి వైఎస్సార్‌ పేరు పెట్టి జగన్‌ తప్పు చేశారు. ఎన్టీఆర్‌కు తెలుగు ప్రజల్లో మంచి పేరుంది. వివాదాలతో వైఎస్సార్‌కు చెడ్డపేరు వస్తుంది. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీలో చేరి.. ఎమ్మెల్యే అయినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫ్యాక్షన్‌ స్టైల్‌లోనే ఉంటే ఎట్లా? అధికారం, పదవులు శాశ్వతం కాదు.

షర్మిల, జగన్‌.. ఇద్దరూ భాజపా వదిలిన బాణాలే
ఏపీ సీఎం జగన్‌, వైతెపా అధ్యక్షురాలు షర్మిల.. ఇద్దరూ భాజపా వదిలిన బాణాలే. విజయమ్మ కూడా ఆ పార్టీ డైరెక్షన్‌లోనే నడుస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రాంత ప్రజల ఓటు బ్యాంకును చీల్చి భాజపాకు ఉపయోగపడాలని, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానివ్వొద్దనేది వారి రాజకీయ వ్యూహం. ధరల పెరుగుదలపై కేంద్రాన్ని జగన్‌, షర్మిల ఎప్పుడైనా నిలదీశారా? భాజపాను ఎప్పుడైనా తిట్టారా? తెరాస నేతలను షర్మిల తిడుతుంటే వారు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు’’ అని జగ్గారెడ్డి అన్నారు.

నేను ఏ పార్టీలో ఉంటే షర్మిలకు ఎందుకు?
వైతెపా అధ్యక్షురాలు షర్మిల తననుద్దేశించి చేసిన వ్యాఖ్యలను జగ్గారెడ్డి ఆక్షేపించారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆమెకెందుకని ప్రశ్నించారు. ‘‘నేను పార్టీలు మార్చిన సంగతి నా ప్రజలకు తెలుసు. వైఎస్సార్‌ కూడా ఇందిరా కాంగ్రెస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్‌ నుంచి వచ్చినవారే. భాజపాలో ఉన్న నన్ను కాంగ్రెస్‌లోకి పిలిచింది రాజశేఖరరెడ్డే. తెలిసీ తెలియక మాట్లాడి.. అభిమానించేవారితోనే ఆయనను తిట్టించే ప్రయత్నం చేయొద్దు. వైఎస్సార్‌ చనిపోయినప్పుడు అందరం ఏడ్చాం. కానీ, వారు(కుటుంబ సభ్యులు) ఎవరు సీఎం కావాలి అని స్కెచ్‌ వేసుకున్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనేది రాజశేఖరరెడ్డి ఆఖరి కోరిక. ఆయన వారసులుగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారా? ఆయన ఆశయాలు నెరవేరుస్తున్నారా?’’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని