రాష్ట్ర పథకాలను కాపీ కొడుతున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సంక్షేమ పథకాలను కాపీ, పేస్ట్‌ చేస్తోందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదంటూనే.. దిల్లీకి వెళ్లి ఇక్కడి పథకాలను అనుసరిస్తున్నారు. రాష్ట్రంలో పాలన,

Published : 27 Sep 2022 04:57 IST

 భాజపాపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం

సిద్దిపేట, చిన్నకోడూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సంక్షేమ పథకాలను కాపీ, పేస్ట్‌ చేస్తోందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదంటూనే.. దిల్లీకి వెళ్లి ఇక్కడి పథకాలను అనుసరిస్తున్నారు. రాష్ట్రంలో పాలన, పథకాలు అద్భుతంగా ఉన్నందునే భాజపా కాపీ కొడుతోంది’ అని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన 50 మంది భాజపా, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో సోమవారం తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మిషన్‌ భగీరథ, కాకతీయ పథకాలను కాపీ కొట్టిన కేంద్రం.. ‘హర్‌ ఘర్‌కో జల్‌’, ‘అమృత్‌ సరోవర్‌’ పేర్లతో అమలు చేస్తోంది. మూగ జీవాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 120 అంబులెన్సుల (ఫోన్‌ సంఖ్య 1962) సేవలు అందుబాటులోకి తెచ్చాం. వీటిని సైతం దేశమంతా కేంద్రం అమలు చేస్తోంది. రైతుబంధును పీఎం కిసాన్‌ యోజనగా తెచ్చింది’’ అని వివరించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సిద్దిపేట నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందని, ప్రజల సహకారంతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామంచ శివారులో రూ.26 కోట్లతో ‘రంగనాయకస్వామి బీఫార్మసీ కళాశాల’ భవన నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే ఆదాయంతో 30 వేల మంది పేద విద్యార్థులకు విద్య అందించడం గొప్ప విషయమని మంత్రి అన్నారు. ఈ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని