షర్మిల వ్యాఖ్యలతోనైనా పునరాలోచించండి

ఆరోగ్య విశ్వవిద్యాలయానికి 30 ఏళ్లుగా ఉన్న ఎన్టీఆర్‌ పేరును మార్చాలన్న జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని ఆయన చెల్లి షర్మిల కూడా తప్పుపట్టినందున  ఇప్పటికైనా దానిపై పునరాలోచన చేయాలని ఆయన ముఖ్యమంత్రికి హితవు పలికారు.

Published : 27 Sep 2022 04:57 IST

సీఎం జగన్‌కు రఘురామకృష్ణరాజు హితవు

ఈనాడు, దిల్లీ: ఆరోగ్య విశ్వవిద్యాలయానికి 30 ఏళ్లుగా ఉన్న ఎన్టీఆర్‌ పేరును మార్చాలన్న జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని ఆయన చెల్లి షర్మిల కూడా తప్పుపట్టినందున  ఇప్పటికైనా దానిపై పునరాలోచన చేయాలని ఆయన ముఖ్యమంత్రికి హితవు పలికారు. ఈ విషయంలో తీరుమార్చుకోకపోతే ప్రజలు ప్రభుత్వాన్నే మార్చేస్తారని హెచ్చరించారు. జిల్లాకు ఎన్టీఆర్‌ పేరుపెడితే అభినందించరా? అని తెలుగుదేశం నాయకులను ప్రశ్నిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి... కడప జిల్లాకు వైఎస్‌ఆర్‌ పేరు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి చెందితే కనీసం ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని గుర్తు చేశారు. సోమవారం ఇక్కడ తన నివాసంలో రఘురామ విలేకర్లతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక సంస్కృతి అని బాలకృష్ణ చేసిన ట్వీట్‌లో తప్పులేదన్నారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటున్న వారు తమ పార్టీని కాపాడటానికి ప్రయత్నించిన తల్లి, చెల్లిని ఏం చేశారో ప్రజలు చూస్తున్నారన్నారు.

ఈసీకి లేఖ
యువజన రైతు శ్రామిక కాంగ్రెస్‌ పార్టీ పేరును ఇకపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌గా మార్చుకుంటున్నట్లు ప్లీనరీలో తమ పార్టీ నాయకులు చేసిన తీర్మానం గురించి ఈసీకి లేఖ రాసినట్లు రఘురామ చెప్పారు. వైఎస్సార్‌ పేరును రాష్ట్రంలోని పురపాలక సంఘాల భవనాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, రోడ్లు, ఇతర సంస్థలకు పెట్టారని, ఒకవేళ తమ పార్టీ పేరును వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌గా మార్చడానికి అనుమతిస్తే రేపు ఎన్నికల సమయంలో ఆ భవనాలను గుడ్డలతో కప్పేస్తారా? అని ప్రశ్నించారు. జగన్‌ను జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు సాక్షిలో రాసిన వార్తా కథనాల క్లిప్పింగ్‌లను ఎన్నికల సంఘానికి పంపినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేసులను సుప్రీంకోర్టులో వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది ఒకరు... వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్‌రెడ్డి తరఫున కూడా వాదనలు వినిపించడం అనుమానాలకు తావిస్తోందని రఘురామ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts