వైకాపా ప్రభుత్వ దుర్మార్గాలు ఎన్నాళ్లో సాగవ్‌

అధికారం చేతిలో ఉందని సీఎం జగన్‌ చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలూ ఎన్నాళ్లో సాగవని విభిన్న ప్రతిభావంతుల సంస్థ మాజీ ఛైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు హెచ్చరించారు.

Published : 27 Sep 2022 05:01 IST

విభిన్న ప్రతిభావంతుల సంస్థ మాజీ ఛైర్మన్‌ గోనుగుంట్ల
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడిని భగ్నం చేసిన పోలీసులు

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే, మంగళగిరి (తాడేపల్లి), న్యూస్‌టుడే: అధికారం చేతిలో ఉందని సీఎం జగన్‌ చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలూ ఎన్నాళ్లో సాగవని విభిన్న ప్రతిభావంతుల సంస్థ మాజీ ఛైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు హెచ్చరించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ విభిన్న ప్రతిభావంతులు సీఎం క్యాంప్‌ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. గుంటూరులోని తారకరామనగర్‌లోని తన ఇంటి వద్ద నుంచి సోమవారం సీఎం క్యాంపు కార్యాలయానికి దివ్యాంగులతో కలిసి ప్రయాణమైన కోటేశ్వరరావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పేరు మార్చడమంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట కలపడమేనన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్‌ ఇప్పుడు వర్సిటీ పేరు మార్చడం దారుణమని అభిప్రాయపడ్డారు. చేసిన తప్పును జగన్‌ సరిదిద్దుకోకపోతేవచ్చే ఎన్నికల్లో వైకాపాకు డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. తెదేపా రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల విభాగం అధ్యక్షుడు పూదోట సునీల్‌ మాట్లాడుతూ జగన్‌ చేస్తున్న ఈ తరహా పనులను సొంత పార్టీ నేతలే తప్పుబడుతున్నారన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు సుఖవాసి శ్రీనివాసరావు, కసుకుర్తి హనుమంతరావు, పొనుగోటి శ్రీనివాసరావు, దియ్యా రామకృష్ణ, సాయి జనార్దన్‌, మద్దుకూరి రామబ్రహ్మం, ఘట్టమనేని గణేష్‌, కావూరి శ్రీనివాస్‌, శివ, వెంకట్రావ్‌ తదితరులు పాల్గొన్నారు.

తెదేపా జాతీయ కార్యాలయం వద్ద రాస్తారోకో
మంగళగిరిలో తెదేపా జాతీయ కార్యాలయం వద్ద రహదారిపై దివ్యాంగులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో ఫలితంగా వాహనాలకు ఆటంకం కలగకుండా సర్వీసు రోడ్డులో వచ్చే వాహనాలు దారి మళ్లించారు. దివ్యాంగులు సీఎం నివాసం వైపునకు వెళ్లకుండా తెదేపా కార్యాలయానికి సమీపంలో పోలీసులు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. సీఎం నివాస మార్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts