సీఎం హోల్‌సేల్‌గా.. మంత్రులు రిటైల్‌గా దోపిడీ

ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా.. వైకాపా మంత్రులు, శాసనసభ్యులు రిటైల్‌గా ప్రభుత్వ ఆస్తులను ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని తెదేపా పొలిట్బ్యూరో

Published : 28 Sep 2022 04:26 IST

నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి ధ్వజం

కాకినాడ జిల్లా జడ్‌.రాగంపేట ఇసుక పాయింట్‌ వద్ద దేవినేని ఉమా ఆందోళన

వెంకటాచలం, గండేపల్లి-న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా.. వైకాపా మంత్రులు, శాసనసభ్యులు రిటైల్‌గా ప్రభుత్వ ఆస్తులను ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో గ్రావెల్‌ అక్రమంగా తరలించిన సర్వేపల్లి రిజర్వాయర్‌, రామదాసుసత్రం, రామదాసుకండ్రిగ గ్రామాల్లో మంగళవారం తెదేపా జిల్లా నాయకులతో కలిసి సోమిరెడ్డి పర్యటించారు. కొద్దిపాటి అనుమతులు తీసుకుని రూ.కోట్ల విలువ గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తుంటే అధికారులేం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆయన అనుచరులు అక్రమంగా గ్రావెల్‌ తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఒక చోట అనుమతులు తీసుకుని వేరే చోటనుంచి అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీలు, బీసీలకు ఇచ్చిన ప్రభుత్వ భూముల్లో 20, 30 అడుగుల మేర గ్రావెల్‌ తరలించి భూములు ఎందుకూ పనికి రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి శ్మశానాలనూ వదలకుండా తవ్వడం దారుణమన్నారు.

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్‌.రాగంపేట ఇసుక స్టాక్‌పాయింట్‌ వద్ద తెదేపా కార్యకర్తలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వంలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి సంపదను పందికొక్కుల్లా వైకాపా నాయకులు దోచుకుంటున్నారని, సీఎం అండతోనే తాడేపల్లి అండర్‌గ్రౌండ్‌కు సంపదను తరలిస్తున్నారని ఆరోపించారు. ఇసుక వ్యాపారమంతా క్యాష్‌ అండ్‌ క్యారీ అని, ఎక్కడా ఆన్‌లైన్‌ చెల్లింపులు లేవని వివరించారు. సీఎం జగన్‌ లారీ ఇసుకను రూ.25 వేల నుంచి రూ.50 వేలకు అమ్ముతున్నారని.. ట్రాక్టర్‌ ఇసుకను రూ.8వేల నుంచి 10వేలకు అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం 80 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే వారికి ఇసుక బిస్కెట్‌ వేశారని విమర్శించారు. ఆందోళనలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని