జగన్‌ కేసుల లాయర్లే... ప్రభుత్వానికీ న్యాయవాదులు

ముఖ్యమంత్రి జగన్‌ తనపై దాఖలైన కేసులను వాదిస్తున్న న్యాయవాదులనే... రాష్ట్రానికి సంబంధించిన అనవసరమైన కేసుల్లో లాయర్లుగా నియమించి రూ.కోట్లలో ప్రజాధనాన్ని ఫీజులుగా

Updated : 28 Sep 2022 06:00 IST

వారికి రూ.కోట్ల ప్రజాధనం దోచిపెడుతున్నారు

ముకుల్‌ రోహత్గీకి ఇచ్చిన 5 కోట్లతో అన్న క్యాంటీన్లు పెట్టొచ్చు

వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్‌రెడ్డి న్యాయవాదే...

పోలవరం కేసులో ప్రభుత్వ లాయరు

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజం

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ తనపై దాఖలైన కేసులను వాదిస్తున్న న్యాయవాదులనే... రాష్ట్రానికి సంబంధించిన అనవసరమైన కేసుల్లో లాయర్లుగా నియమించి రూ.కోట్లలో ప్రజాధనాన్ని ఫీజులుగా ముట్టచెబుతున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి కేసుల్లో ముకుల్‌ రోహత్గీ అనే సీనియర్‌ న్యాయవాదిని నియమించుకుని, 2020 జనవరి 22న జారీ చేసిన జీవో నం.1 ప్రకారం రూ.5 కోట్లు ముట్టజెప్పారన్నారు. రోహత్గీకి ఇచ్చిన డబ్బులతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే వేల మంది పేదల కడుపులు నింపొచ్చన్నారు. ‘జగన్‌రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు శివశంకర్‌రెడ్డి తరపున సీనియర్‌ అడ్వకేట్‌ అభిషేక్‌మను సింఘ్వి సోమవారం బెయిల్‌ పిటిషన్‌ వేశారు. అదే సింఘ్వి పోలవరం తరపున కేసు వాదించేందుకు ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజును సీబీఐ అధికారులు కొట్టిన కేసులో, అమరావతిలో రైతులకు వ్యతిరేకంగా వేసిన కేసుల్లోనూ ప్రభుత్వం తరఫున వాదించేందుకు జగన్‌రెడ్డి కేసులను వాదిస్తున్న లాయర్లనే నియమించి, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.కోట్లలో ఫీజులు చెల్లిస్తున్నారు’ అని మంగళవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బొండా ఉమ ధ్వజమెత్తారు. ‘విభజన చట్టంలోని హక్కుల సాధనకు ఏ ఒక్క న్యాయవాదినైనా నియమించారా? తెలంగాణ నుంచి మనకు రావలసిన ఆస్తులపై ఏం కేసులు వేశారు? ఏపీకి విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం స్పష్టంచేశాక కూడా వాటిని తెచ్చుకోలేని అసమర్థుడు జగన్‌రెడ్డి కాదా?’ అని మండిపడ్డారు.

కోర్టులు మొట్టికాయలు వేసినా... 

‘పోలవరంపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టుకి వెళ్లింది. ఆ కేసును వాదించడానికి అభిషేక్‌మను సింఘ్విని నియమించారు. ఆయన కేసుకి హాజరవకపోవడంతో అప్పటికప్పుడు వెంకట్రామయ్య అనే లాయర్‌ను తెచ్చారు. ఇలా ఎంతో మందిని న్యాయవాదులుగా నియమించి ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. జగన్‌ తీరు చూసి సుప్రీంకోర్టే నివ్వెరపోయింది. ఆసలు ఏపీ లాయర్‌ ఎవరు? ఎందుకు ఇంతమందిని నియమిస్తున్నారు? ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని సుప్రీంకోర్టు బెంచ్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది’ అని బొండా ఉమా గుర్తుచేశారు. ‘ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే... రాష్ట్రానికి సంబంధించిన కేసులపై ప్రైవేటు లాయర్లని నియమించి ఏం సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏ కేసుకి ఎన్ని డబ్బులు చెల్లించారో ప్రజలకు జగన్‌రెడ్డి వివరణ ఇవ్వాలి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు.

అడ్వకేట్‌ జనరల్‌ ఏం చేస్తున్నారు? 

‘జగన్‌రెడ్డి ప్రభుత్వం నియమించిన అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ సుధాకర్‌లు ఏం చేస్తున్నారు? వీరున్నప్పుడు... ప్రైవేటు న్యాయవాదులు ఎందుకు? సుప్రీం, హైకోర్టుల్లో ప్రభుత్వ కేసులను వాదించడానికి... నిమ్మగడ్డ కేసు, భారతి సిమెంట్‌ కేసులు, సాక్షి పత్రికకు సంబంధించిన కేసులను వాదించే వారినే ఎందుకు తీసుకొస్తున్నారు? మూడున్నరేళ్లలో జగన్‌రెడ్డి ప్రభుత్వం గెలిచిన కేసు ఒక్కటైనా ఉందా? ఓబుళాపురంలో రూ.లక్ష కోట్ల విలువైన ఖనిజాన్ని దొంగిలించిన గాలి జనార్దన్‌రెడ్డికి మేలు చేయడానికి ప్రైవేటు న్యాయవాదుల్నిపెట్టి ఓబులాపురం గనులను... మళ్లీ ఆయనకు ఇవ్వడానికి అభ్యంతరం లేదని ప్రభుత్వం పిటిషన్‌ వేసింది. ఇది నీకది-నాకిది కాదా?’ అని బొండా ఉమ మండిపడ్డారు.


శివశంకర్‌రెడ్డి రూ.50 లక్షల ఫీజు చెల్లించగలడా?: వర్ల రామయ్య

వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి... రూ.50 లక్షల ఫీజు చెల్లించి అభిషేక్‌మను సింఘ్వి వంటి న్యాయవాదిని నియమించుకునేంత ధనవంతుడు కాదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘పోలవరం ప్రాజెక్టు గురించి ఎన్జీటీలో మాట్లాడాల్సిన అభిషేక్‌ సింఘ్వి వివేకా హత్య కేసు ముద్దాయి శంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇప్పించే పనిలో ఉన్నారు. అంతటి ప్రముఖ న్యాయవాదులను నియమించింది ఎవరు? వివేకా హత్య కేసు దర్యాప్తునకు అడుగడుగునా అడ్డు తగులుతున్న అదృశ్య శక్తి ఎవరు? వివేకా హత్యకేసులో నిందితుల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నది ఎవరు? సుప్రీంకోర్టులో ఒకసారి హాజరయ్యేందుకే రూ.50 లక్షలు తీసుకునే లాయర్లను నియమిస్తున్న అజ్ఞాత శక్తి ఎవరు? విచారణకు వచ్చిన సీబీఐ అధికారులను భయపెడుతున్నదెవరు? వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని మించిన కుట్రదారులు ఎవరున్నారో బహిర్గతం కావాలి. తనకు ప్రాణహాని ఉందని జగన్‌ సోదరి, వివేకా కుమార్తె సునీత కడప ఎస్పీని కోరిందంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా? న్యాయం కోసం దిల్లీ వెళ్లిన సునీతకు అండగా ఉండి, విచారణ చేయించలేని స్థితిలో జగన్‌ ఉన్నారు’ అని ధ్వజమెత్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని