సుప్రీంలో ఠాక్రేకు ఎదురుదెబ్బ

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు సుప్రీంకోర్టులో మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఠాక్రే, సీఎం ఏక్‌నాథ్‌ శిందేల నేతృత్వంలోని వర్గాల్లో ఏది అసలైన శివసేన పార్టీయో తేల్చేందుకు ఎన్నికల సంఘాన్ని (ఈసీ) సర్వోన్నత

Published : 28 Sep 2022 05:31 IST

అసలైన శివసేన ఎవరిదో తేల్చేందుకు ఎన్నికల సంఘానికి అనుమతి

‘మెజార్టీ’ నియమాన్ని వర్తింపజేస్తామన్న ఈసీ

శిందే వర్గానికి సానుకూల పరిణామం!

దిల్లీ: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు సుప్రీంకోర్టులో మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఠాక్రే, సీఎం ఏక్‌నాథ్‌ శిందేల నేతృత్వంలోని వర్గాల్లో ఏది అసలైన శివసేన పార్టీయో తేల్చేందుకు ఎన్నికల సంఘాన్ని (ఈసీ) సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. తమనే అసలైన శివసేనగా గుర్తించాలంటూ శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించాలని సూచించింది. ఈ వ్యవహారంపై గతంలో విధించిన స్టేను ఎత్తివేసింది. శిందే వర్గం వేసిన పిటిషన్‌పై నిర్ణయం తీసుకోకుండా ఈసీని నిలువరించాలంటూ ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ స్పందించారు. అసలైన శివసేన ఎవరిదో తేల్చే విషయంలో తాము ‘మెజార్టీ నియమాన్ని’ పూర్తి పారదర్శకంగా వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. ఐక్య శివసేనకు చెందిన ఎక్కువ మంది శాసనసభ్యులు, పార్టీ వ్యవస్థాగత విభాగాల్లోని మెజార్టీ సభ్యులు ప్రస్తుతం శిందేె వెనకే ఉన్నారు. దీంతో ఆయన వర్గమే అసలైన శివసేనగా గుర్తింపు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

శివసేనలో చీలిక కారణంగా మహారాష్ట్రలో ఈ ఏడాది జూన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం భాజపా మద్దతుతో శిందే ముఖ్యమంత్రి పీఠమెక్కారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అసలైన శివసేనగా తమనే గుర్తించాలని, ఆ పార్టీ ఎన్నికల గుర్తుగా ఉన్న ‘విల్లు-బాణం’ను తమకే కేటాయించాలని శిందే వర్గం ఈసీని ఆశ్రయించింది. అయితే ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా ఈసీని అడ్డుకోవాలంటూ ఠాక్రే వర్గం సుప్రీం తలుపుతట్టింది. ఈ వ్యవహారంపై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ నిర్వహించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని