గహ్లోత్‌ విధేయుల్లో ముగ్గురికి షోకాజ్‌ నోటీసులు

ధిక్కార స్వరాన్ని వినిపించిన వ్యవహారంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ విధేయులు ముగ్గురికి అధిష్ఠానం మంగళవారం రాత్రి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. మంత్రులు శాంతి ధారీవాల్‌, మహేశ్‌ జోషి, ఎమ్మెల్యే ధర్మేందర్‌

Published : 28 Sep 2022 05:36 IST

పరిశీలకుల సిఫార్సు ఆధారంగా అధిష్ఠానం చర్య

దిల్లీకి చేరుకున్న సచిన్‌ పైలట్‌

దిల్లీ, జైపుర్‌: ధిక్కార స్వరాన్ని వినిపించిన వ్యవహారంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ విధేయులు ముగ్గురికి అధిష్ఠానం మంగళవారం రాత్రి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. మంత్రులు శాంతి ధారీవాల్‌, మహేశ్‌ జోషి, ఎమ్మెల్యే ధర్మేందర్‌ రాఠోడ్‌ వీటిని అందుకున్నారు. తీవ్రస్థాయి క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినందుకుగానూ ఎందుకు చర్యలు తీసుకోరాదో 10 రోజుల్లో చెప్పాలని క్రమశిక్షణ సంఘం వారిని ఆదేశించింది. పార్టీ పరిశీలకులు మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మాకన్‌లు సమర్పించిన లిఖితపూర్వక నివేదిక ఆధారంగా ఏఐసీసీ ఈ చర్య చేపట్టింది. రెండ్రోజుల క్రితం జైపుర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు గైర్హాజరై సొంతంగా సమావేశం నిర్వహించుకున్న విషయం తెలిసిందే. స్వయానా చీఫ్‌ విప్‌.. అధికారిక సమావేశానికి రాకుండా అనధికార భేటీకి వెళ్లడాన్ని అధిష్ఠానం తప్పుపట్టింది. ముఖ్యమంత్రిపై మాత్రం ఎలాంటి చర్యను పరిశీలకులు సిఫార్సు చేయలేదు. రాజస్థాన్‌ సంక్షోభానికి పరిష్కారం విషయంలో పలువురు సీనియర్‌ నేతలతో సోనియాగాంధీ మాట్లాడుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి గహ్లోత్‌ పేరును పూర్తిగా పక్కన పెట్టకపోయినా, ప్రత్యామ్నాయ అభ్యర్థులుగా మల్లికార్జున ఖర్గే, ఎ.కె.ఆంటోనీ, కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌సింగ్‌, అంబికా సోనీ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో చాలామంది తాము బరిలో లేనట్లు చెబుతున్నారు.

నా ప్రమేయం లేదు : గహ్లోత్‌

రాజస్థాన్‌ రాజకీయ పరిణామాల నేపథ్యంలో యువనేత సచిన్‌ పైలట్‌ దిల్లీ చేరుకున్నారు. గహ్లోత్‌ వెంట 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారాన్ని పైలట్‌ వర్గం ఖండిస్తోంది. ఒక్క బస్సులో అంతమంది ప్రయాణించగలగడంపై ప్రశ్నలు సంధిస్తోంది. గహ్లోత్‌ ఇప్పటికే తన వాదనను సోనియాకు వినిపించారు. సమాంతర సీఎల్పీ సమావేశంలో తన ప్రమేయమే లేదనీ, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని