సంక్షిప్త వార్తలు(6)

ప్రాక్టీసు లేక చెట్టుకింద ప్లీడరుగా ఉండే అంబటి రాంబాబు రెండు దశాబ్దాల తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి వచ్చాక ఏం మాట్లాడుతున్నారని తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. గుంటూరులో

Updated : 29 Sep 2022 05:16 IST

ఎవరికి బలిసిందో ప్రజలకు తెలుసు

తెనాలి శ్రావణ్‌కుమార్‌

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: ప్రాక్టీసు లేక చెట్టుకింద ప్లీడరుగా ఉండే అంబటి రాంబాబు రెండు దశాబ్దాల తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి వచ్చాక ఏం మాట్లాడుతున్నారని తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. గుంటూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అంబటి రాంబాబు రాజధాని అమరావతి రైతుల పాదయాత్రపై వ్యంగ్యంగా, అవమానించేలా ఒళ్లు బలిసినవారే పాదయాత్ర చేస్తున్నారనడాన్ని ఖండిస్తున్నాం. మంత్రి పదవి వచ్చాక రాంబాబుకు ఒళ్లు బలిసిందో.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం భూములిచ్చిన రైతులకు ఒళ్లు బలిసిందో ప్రజలందరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించారు.


తెదేపా ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెలుగు నేలపై అంటరానితనాన్ని తన కవిత్వంతో ప్రశ్నించిన గొప్ప అభ్యుదయ కవి గుర్రం జాషువా అని పలువురు తెదేపా నేతలు కొనియాడారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం గుర్రం జాషువా జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్‌, తదితరులు పాల్గొన్నారు.


బలుపు మాటలు మానకపోతే చట్టసభలకు మళ్లీ రాలేవు
ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి హెచ్చరిక

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అమరావతి రైతుల పాదయాత్రపై బలుపు మాటలు మానకపోతే మళ్లీ చట్టసభలకు రాలేవని మంత్రి అంబటి రాంబాబును తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. ‘1989లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన అంబటి మళ్లీ సభకు రావడానికి 25 ఏళ్లు పట్టింది. రైతులపై ఇలాగే అనుచిత వ్యాఖ్యలు చేస్తే మరో 25 ఏళ్ల వరకు ఆయన చట్టసభలకు రాలేరు. కారుకూతలు కూసే అంబటి లాంటివారికి ప్రజలే బుద్ధి చెబుతారు’ అని ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు.


చీరాల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జిగా కొండయ్యే

ఈనాడు, అమరావతి: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి తెదేపా ఇన్‌ఛార్జిగా మద్దులూరి కొండయ్యే కొనసాగుతారని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించి పార్టీలోకి కొత్తగా ఎవరైనా వచ్చినా వారు కొండయ్యతో కలసి పని చేయాల్సిందేనన్నారు. చంద్రబాబు బుధవారం చీరాల సహా ఆరు నియోజకవర్గాలపై సమీక్షించారు. రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు పెదకూరపాడు, మంత్రాలయం, కనిగిరి, కోడుమూరు, చీరాల నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు కొమ్మాలపాటి శ్రీధర్‌, తిక్కారెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, ప్రభాకర్‌, కొండయ్యలతో ముఖాముఖి సమావేశమయ్యారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని, ఇన్‌ఛార్జుల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా  బయటి నుంచి వచ్చే వారికే వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ దక్కే అవకాశం ఉందని వివిధ మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కొండయ్య ప్రస్తావించారు. ఆ ప్రచారాన్ని చంద్రబాబు కొట్టిపారేశారు.


పీఎం ప్రణామ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలి: తమ్మినేని

ఈనాడు, హైదరాబాద్‌: పీఎం ప్రణామ్‌ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు. ఎరువుల వినియోగం తగ్గిస్తే ఉత్పాదకత తగ్గుతుందన్నారు. హెక్టారుకు చైనాలో 400 కిలోలు, అమెరికాలో 350 కిలోల ఎరువులను వినియోగిస్తున్నారని.. భారత్‌లో 175 కిలోలు మాత్రమే వినియోగిస్తున్నారని ఆయన వివరించారు. ఎరువులపై ప్రస్తుతం ఇస్తున్న రాయితీలను పెంచాలని డిమాండ్‌ చేశారు. చైనా, అమెరికాల్లో వ్యవసాయానికి బడ్జెట్‌లో 7-8 శాతం కేటాయిస్తుండగా.. భారత్‌ 2.3 శాతమే ఖర్చు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.


‘గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ పొడిగింపుపై సంజయ్‌ హర్షం

ఈనాడు, హైదరాబాద్‌: గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనను కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. దసరా, దీపావళి పండగల సమయంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం పేదలకు మేలు చేస్తుందన్నారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు