అన్నింటినీ కాజేస్తున్న వైకాపా దోపిడీదారులు

రాష్ట్రంలో ఓబులాపురం గనుల నుంచి సామాన్యుల ఆస్తుల వరకూ అన్నింటినీ వైకాపా దోపిడీదారులు కాజేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. సహజ వనరులను దోచుకోవడమే వారి

Updated : 29 Sep 2022 05:33 IST

కాల్వ శ్రీనివాసులు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ఓబులాపురం గనుల నుంచి సామాన్యుల ఆస్తుల వరకూ అన్నింటినీ వైకాపా దోపిడీదారులు కాజేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. సహజ వనరులను దోచుకోవడమే వారి పనిగా మారిందని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రానైట్‌, రాయలసీమలోని ఖనిజాల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. మంగళగిరిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో అర్హులు దరఖాస్తు చేసినా గనులు దక్కే అవకాశం లేకుండా చేస్తున్నారు. అనంతపురం జిల్లా సరిహద్దులో.. బళ్లారి సమీపంలో ఉండే ఓబులాపురం గ్రామంలోని 25 హెక్టార్ల విస్తీర్ణంలోని మైనింగ్‌ ప్రాంతాన్ని ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. వీళ్లు ఖనిజాన్ని విచ్చలవిడిగా ఇతరులకు అమ్ముకునే అవకాశం ఉంది. ఓబులాపురంలో లభించే 75 శాతం ఖనిజాన్ని కడప స్టీల్‌ ప్లాంటుకు ఇవ్వాలనే నిబంధన ఉన్నా పర్యవేక్షించేవారు కరవయ్యారు. ఇక్కడ జరిగే దోపిడీని ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. మంత్రి పరోక్ష హస్తంతోనే ఇదంతా జరుగుతోంది. ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ దగ్గర సీబీఐ సీజ్‌ చేసిన ఖనిజాన్నీ జగన్‌ సీఎం అయ్యాక దొంగతనంగా విక్రయించారని రాయదుర్గం న్యాయస్థానంలో ఒకరు పిటిషన్‌ వేశారు. ఈ విక్రయం వెనుక రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాత్ర ఉంది. ఇప్పటికైనా ఈ దోపిడీని అడ్డుకోవాలి’ అని శ్రీనివాసులు డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని