మీరెన్ని కారణాలు చెప్పినా ప్రజలు సంతృప్తి చెందరు: జగన్‌కు మాజీ మంత్రి మండవ లేఖ

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు తొలగింపు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని కారణాలు చెప్పినా ప్రజలు సంతృప్తి చెందరని ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పేరు

Updated : 29 Sep 2022 09:21 IST

ఈనాడు, అమరావతి: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు తొలగింపు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని కారణాలు చెప్పినా ప్రజలు సంతృప్తి చెందరని ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పేరు తొలగింపుపై నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. ‘అధికారం మారినప్పుడల్లా పాలకులు ఇష్టానుసారంగా ఆయా సంస్థలకు ఉన్న పేర్లు తొలగించి కొత్తవి తగిలించే చెడు సంప్రదాయానికి మీరు తెరలేపినట్లైంది. ఇది ఎంతవరకు సమంజసం? సమర్థనీయం’ అని ఆ లేఖలో నిలదీశారు. ‘మీ తండ్రి రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా.... ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం అనే పేరు ముందు డాక్టర్‌ అనే పదాన్ని జోడిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఏపీలో సీఎంగా చంద్రబాబు హయాంలో కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు పేర్లతో పార్కులు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థతోపాటు ఆయన విగ్రహం, కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్‌ స్టేడియం, మొదలైనవి ఏర్పాటు చేసి మాజీ సీఎంలకు గౌరవం కల్పించాం’ అని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తెరాస మాజీ సీఎంల పేర్లు మార్చలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని