ప్రతి ఇల్లూ తిరిగితే.. 175 సీట్లూ మనవే

‘రేపు మళ్లీ మనల్ని మనం గెలిపించుకోవడానికే గడప గడపకు కార్యక్రమం చేపట్టాం. దీనిలో ఎక్కడైనా అడ్డదారులు (షార్ట్‌కట్స్‌) ఉపయోగిస్తే నష్టపోయేది మనమే. అలాంటివేవీ లేకుండా మీరు గడప గడపకు కార్యక్రమాన్ని నూరు శాతం పూర్తి చేస్తే..

Updated : 29 Sep 2022 05:22 IST

 అడ్డదారులు ఉపయోగిస్తే నష్టపోయేది మనమే
 పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ‘రేపు మళ్లీ మనల్ని మనం గెలిపించుకోవడానికే గడప గడపకు కార్యక్రమం చేపట్టాం. దీనిలో ఎక్కడైనా అడ్డదారులు (షార్ట్‌కట్స్‌) ఉపయోగిస్తే నష్టపోయేది మనమే. అలాంటివేవీ లేకుండా మీరు గడప గడపకు కార్యక్రమాన్ని నూరు శాతం పూర్తి చేస్తే... వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుస్తాం’ అని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. ‘ఎన్నికలకు బహుశా మరో 19 నెలల గడువుంది. అంటే మనకు తగిన సమయం ఉన్నట్టే. ప్రతి ఇంటికీ తిరిగితేనే మన గ్రాఫ్‌ పెరుగుతుంది. ప్రతి రోజూ పరీక్షకు వెళ్లినట్లే సిద్ధమవ్వండి. అలా పనిచేయకపోతే నష్టపోతాం. మొదటిసారితో పోలిస్తే కార్యక్రమంలో పురోగతి బాగుంది. కానీ పరీక్ష రాసేటప్పుడు షార్ట్‌కట్స్‌కు తావిస్తే ఫెయిలవుతామని గుర్తుంచుకోండి’ అని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటూ వదలకుండా 175కి 175 కొట్టాల్సిందేనని పునరుద్ఘాటించారు. ‘ప్రభుత్వపరంగా మంచి పనులు చేశాం. 85 శాతం ఇళ్లకు మంచి జరిగింది. గ్రామ సచివాలయాల పరిధిలో మీరు గుర్తించిన ప్రాధాన్యతా పనుల్నీ 2 నెలల్లో మొదలయ్యేలా చర్యలు తీసుకున్నాం. అలాంటప్పుడు 175 సీట్లు సాధించడం ఎందుకు సాధ్యం కాదు?’ అని సీఎం ప్రశ్నించారు. ‘చక్కటి పరిపాలన అందించాకే గడప గడపకు వెళుతున్నాం. ప్రతి ఇంటికీ ఏ మేలు జరిగింది? ఏ పథకాలు అందాయి? అన్న జాబితాలూ తీసుకుని వెళుతున్నాం. మనం ఇచ్చిన హామీల్ని 98.4 శాతం అమలు చేశాం. డీబీటీ రూపంలో రూ.1.71 లక్షల కోట్లు అందించాం. దేశ రాజకీయ చరిత్రలోనే.. మీ ఇంటికి మేలు చేశాం, ఆశీర్వదించండి అంటూ ప్రజల ముందుకెళుతున్న ఏకైక ప్రభుత్వం మనది’ అని సీఎం తెలిపారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఒక గ్రామ సచివాలయానికి వెళ్లినప్పుడు... ఎన్ని రోజులు పట్టినా.. దాని పరిధిలోని నూరు శాతం ఇళ్లను పూర్తి చేయాల్సిందేనని జగన్‌ స్పష్టం చేశారు. ‘జుట్టు ఉంటేనే ముడేసుకోగలం. అధికారంలో ఉంటేనే ప్రజలకు మేలు చేయగలుగుతాం. 175కి 175 మన లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ గురి తప్పడానికి వీల్లేదు’ అని స్పష్టం చేశారు. ప్రాంతీయ సమన్వయకర్తలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలి: సజ్జల

త్వరలో జరిగే పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించేందుకు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలంతా కృషి చేయాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts