సంక్షిప్త వార్తలు(7)

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గానికి తెదేపా ఇన్‌ఛార్జిగా ఎరిక్సన్‌ బాబే కొనసాగుతారని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన గురువారం విజయవాడ తూర్పు

Updated : 30 Sep 2022 06:09 IST

కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడం మంచిదే: నారాయణ

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా నాటికి జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం మంచిదేననీ, అయితే అది భాజపా వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతూ, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన కూటమి అవసరమని అన్నారు. భాజపాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక మంది సీఎంలు, కాంగ్రెస్‌ సహా అన్ని జాతీయ పార్టీలు ముందుకొస్తున్నాయనీ, ఇందుకు కేసీఆర్‌ కూడా ముందుకురావడం సమర్థనీయమని పేర్కొన్నారు.


మూడోసారి ఎస్పీ అధ్యక్షుడిగా అఖిలేశ్‌

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేశ్‌ యాదవ్‌ గురువారం మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దళిత ఉద్ధారకుడు భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌, సోషలిస్టు నాయకుడు రామ్‌ మనోహర్‌ లోహియా సిద్ధాంతాలను పాటించేవారిని ఏకతాటిపైకి తీసుకురావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా పార్టీకి జాతీయస్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు అంతా కృషి చేయాలన్నారు. ఆయన నేతృత్వంలోనే 2024 లోక్‌సభ, 2027లో జరిగే ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలను పార్టీ ఎదుర్కోనుంది.


ఎరిక్సన్‌ బాబే యర్రగొండపాలెం తెదేపా ఇన్‌ఛార్జి

ఈనాడు, అమరావతి: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గానికి తెదేపా ఇన్‌ఛార్జిగా ఎరిక్సన్‌ బాబే కొనసాగుతారని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన గురువారం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, చీపురుపల్లి, రాయదుర్గం, సాలూరు, మచిలీపట్నం, యర్రగొండపాలెం నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు కిమిడి నాగార్జున, కాలవ శ్రీనివాసులు, గుమ్మడి సంధ్యారాణి, కొల్లు రవీంద్ర, ఎరిక్సన్‌బాబులతో ముఖాముఖి సమావేశమయ్యారు. యర్రగొండపాలెం ఇన్‌ఛార్జి ఎరిక్సన్‌బాబుకి సహకరించాలని ఆ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత మన్నె రవీంద్రకు చంద్రబాబు సూచించినట్లు తెదేపా వర్గాలు తెలిపాయి.


దేశానికి గంజాయి సరఫరా కేంద్రంగా రాష్ట్రం: గుమ్మడి సంధ్యారాణి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా హయాంలో అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంటే... జగన్‌ మాత్రం ఏపీని దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేసే రాష్ట్రంగా మార్చారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. గంజాయి అక్రమ రవాణాలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడానికి జగన్‌ ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘రోజుకు వేల టన్నుల్లో గంజాయి అక్రమ రవాణా జరుగుతుంటే 1,775 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైకాపా నాయకుల ఇళ్లలో, కార్లలో గంజాయి దొరుకుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. దేశంలో పట్టుబడిన ఏడు లక్షల కిలోల గంజాయిలో రెండు లక్షల కిలోలు ఏపీలోనే పట్టుబడిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని సంధ్యారాణి ఆందోళన వ్యక్తంచేశారు.


వైకాపా నాయకులపై ప్రజల తిరుగుబాటు
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజలు వైకాపా నాయకులపై తిరగబడుతున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి ఎద్దేవాచేశారు. పులివెందులలో జగన్‌ ఏ రోజూ తిరగలేదని, ప్రజల సమస్యలు తెలుసుకొనే ప్రయత్నమే చేయలేదన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును నిర్మించలేదు. మూడున్నరేళ్లు గడుస్తున్నా ఒక్క విభజన హామీనీ సాధించలేకపోయారు. సొంత నియోజకవర్గంలో బస్టాండ్‌ కూడా నిర్మించలేని జగన్‌... ఎమ్మెల్యేలను వేలెత్తి చూపించడం హాస్యాస్పదం. రాబోయే ఎన్నికల్లో వైకాపా 150 సీట్లలో ఓడిపోనుందని ఐప్యాక్‌ సర్వేలో తేలింది. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే, 27 మంది ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగడం లేదని, వారిని మారుస్తామంటూ కొత్త నాటకానికి తెరలేపారు. దొంగ లెక్కలతో అప్పులు చేసి రాష్ట్రాన్ని 30 ఏళ్ల వెనక్కు నెట్టారు’ అని రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి మండిపడ్డారు.


విగ్రహ దిమ్మె కూల్చివేత దుర్మార్గం: సీపీఐ

ఈనాడు, అమరావతి: బీసీ రిజర్వేషన్ల ఆద్యులు, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన బీపీ మండల్‌ విగ్రహం ఏర్పాటుకు నిర్మించిన దిమ్మెను గుంటూరు నగరపాలక సంస్థ సిబ్బంది కూల్చివేయడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పౌర హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌గా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాలయాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు బీపీ మండల్‌ ఎంతో కృషి చేశారని, అంతటి మహనీయుడిని గుర్తుంచుకునేలా విగ్రహం ఏర్పాటు చేస్తుంటే ఆటంకం కలిగించడం తగదన్నారు.


మాది ప్రజలు మెచ్చే విధానం

జల్‌జీవన్‌ మిషన్‌ అమలులో పరిమాణం పరంగా పశ్చిమ బెంగాల్‌ దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. రాష్ట్రానికి, ప్రజలకు అనుకూలమైన విధానాలనే మేము అమలు చేస్తున్నాం. ఇందుకు అధికారుల నిబద్ధత కూడా తోడవడం వల్లే విజయాలు సాధిస్తున్నాం. భవిష్యత్తులోనూ అంకితభావంతో ప్రజా సేవలో నిమగ్నమవుతాం.

- మమతా బెనర్జీ


ప్రతీకార రాజకీయాలను ప్రజలు చీదరించుకుంటున్నారు

గుజరాత్‌ భాజపా చేతుల్లోంచి జారిపోయింది. ఆ పార్టీ ఇప్పుడు దిల్లీలో తప్పుడు పరిశోధనలు చేయడంలో నిమగ్నమైంది. 24 గంటలూ ప్రతికూల, ప్రతీకార రాజకీయాలు చేయడమే కాషాయ పార్టీ పని. ప్రజలు వాటిని చీదరించుకుంటున్నారు. తమ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని వారు అడుగుతున్నారు.

- కేజ్రీవాల్‌


ఓట్ల కోసమే అంబేడ్కరిస్టు ముసుగు

సమాజ్‌వాదీ పార్టీ తన ఎత్తుగడలతో ‘అంబేడ్కరిస్టు’గా కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. ఓట్లను చేజిక్కించుకోవాలన్న స్వార్థంతో చాలా రాజకీయ పార్టీలు ఈ మసుగు ధరిస్తున్నాయి. ఇదంతా కపట నాటకం. అంబేడ్కర్‌ ఆశయాలను సాధించి.. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రయత్నించిన చరిత్ర వీటికి లేదు.

- మాయావతి


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు