అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో తాను లేనని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ స్పష్టంచేశారు. దిల్లీలో గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆయన భేటీ అయ్యారు. రాజస్థాన్‌లో ఇటీవలి పరిణామాలపై విచారం వ్యక్తం చేసి, ఆమెకు

Published : 30 Sep 2022 06:41 IST

  సోనియాతో భేటీ తర్వాత గహ్లోత్‌ ప్రకటన

  రాజస్థాన్‌ పరిణామాలపై అధ్యక్షురాలికి క్షమాపణ

  బరిలో దిగ్విజయ్‌ సింగ్‌, శశిథరూర్‌

  నేటితో నామినేషన్ల గడువు పూర్తి

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో తాను లేనని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ స్పష్టంచేశారు. దిల్లీలో గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆయన భేటీ అయ్యారు. రాజస్థాన్‌లో ఇటీవలి పరిణామాలపై విచారం వ్యక్తం చేసి, ఆమెకు క్షమాపణ చెప్పినట్లు ఆయన విలేకరులకు తెలిపారు. ‘‘రెండ్రోజుల క్రితం జరిగిన ఘటనలు నన్ను షాక్‌కు గురి చేశాయి. కారణాలు ఏమైనప్పటికీ.. ఆనవాయితీ ప్రకారం సీఎల్పీలో చేయాల్సిన ఏకవాక్య తీర్మానాన్ని చేయించలేకపోయాను. దానికి నన్ను క్షమించాల్సిందిగా సోనియాను కోరాను. నేను ముఖ్యమంత్రిగా కొనసాగాలని అనుకోవడం వల్లే ఇదంతా జరిగిందన్న ప్రచారం నన్నెంతగా క్షోభకు గురి చేసిందో నాకు మాత్రమే తెలుసు’’ అని తెలిపారు. నైతిక బాధ్యతతో బరి నుంచి వైదొలగుతున్నానని ప్రకటించారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా తాను కొనసాగాలా, లేదా అనేది సోనియా చేతుల్లోనే ఉందన్నారు. రాజస్థాన్‌ యువనేత సచిన్‌ పైలట్‌ కూడా గురువారమే సోనియాతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

థరూర్‌తో డిగ్గీరాజా కుస్తీ

గహ్లోత్‌ వైదొలగడంతో కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌ (డిగ్గీరాజా) మిగలనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అయిన శుక్రవారమే ఇద్దరూ తమతమ పత్రాలను సమర్పించనున్నారు. దిగ్విజయ్‌కు కాంగ్రెస్‌పై గట్టిపట్టు ఉంది. తెరవెనక మంతనాలు తెలిసిన నేత. చాలా రాష్ట్రాల నేతలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. పట్టణ వాసులు, విద్యావంతుల్లో శశిథరూర్‌కు ఆదరణ ఉంది. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కొద్దిమంది కాంగ్రెస్‌ నాయకుల్లో ఆయనొకరు. అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన 23 మందిలో థరూర్‌ ఉన్నారు.

ఎవరు గెలిచినా పార్టీ విజయమే: థరూర్‌

దిగ్విజయ్‌ సింగ్‌ గురువారం నామపత్రాలు స్వీకరించిన అనంతరం శశిథరూర్‌ను కలిశారు. దిగ్విజయ్‌ పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు థరూర్‌ తెలిపారు. ఇది తమ మధ్య పోరాటంగా కాకుండా.. స్నేహపూర్వక పోటీగానే ఉండాలని ఇద్దరం అంగీకరించుకున్నట్లు పేర్కొన్నారు. ఎవరు గెలిచినా కాంగ్రెస్‌ గెలిచినట్లేనని ట్వీట్‌ చేశారు. అక్టోబరు 8లోగా ఇద్దరిలో ఎవరూ నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే అక్టోబరు 17న ఎన్నికలు నిర్వహించి, 19న ఫలితాలు ప్రకటిస్తారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని