ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధం తగదు

ముందస్తు ప్రణాళిక లేకుండా ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను నిషేధిస్తూ సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయంతో.. ఆ రంగంపై ఆధారపడ్డ సుమారు ఏడు లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా

Updated : 30 Sep 2022 05:33 IST

ముఖ్యమంత్రి జగన్‌కు నారా లోకేశ్‌ లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముందస్తు ప్రణాళిక లేకుండా ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను నిషేధిస్తూ సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయంతో.. ఆ రంగంపై ఆధారపడ్డ సుమారు ఏడు లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నవంబరు 1 నుంచి నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. ఫ్లెక్సీ పరిశ్రమపై ఆధారపడ్డ వారిని ఆదుకోవాలని కోరుతూ సీఎం జగన్‌కు గురువారం ఆయన లేఖ రాశారు. ‘‘పర్యావరణంపై జగన్‌ చూపిస్తున్న ప్రేమ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అటు ఇసుక, మట్టి, మైనింగ్‌ మాఫియాలను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. విశాఖలో పచ్చని రుషికొండను బోడికొండగా మార్చారు. వాటిమీద దృష్టి పెడితే పర్యావరణానికి మేలు చేసినవారవుతారు. ఫ్లెక్సీల తయారీపై ఆధారపడిన చాలామంది రూ.లక్షల్లో అప్పులు చేసి యూనిట్లను నెలకొల్పారు. ప్రభుత్వ నిర్ణయంతో వారికి కోలుకోలేని దెబ్బతగిలింది. వారి సమస్యలను అధ్యయనం చేసేందుకు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సూచించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని వేయాలి. నిషేధం నిర్ణయాన్ని ఏడాది పాటు వాయిదా వేయాలి. కొత్త యంత్రాలు కొనుగోలుకు, పాతవాటి సామర్థ్యం పెంచుకోవడానికి రాయితీతో రుణాలివ్వాలి’ అని లోకేశ్‌ లేఖలో  పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని