CM Jagan: వారసులొద్దు.. ఈసారికి మీరే

‘మీ వారసులను ప్రమోట్‌ చేసుకోండి. కానీ, వచ్చే ఎన్నికల కోసం మాత్రం వద్దు. వచ్చే ఎన్నికల్లో మీరే పోటీ చేయాలి’ అని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు,

Updated : 01 Oct 2022 07:20 IST

ఎన్నికల్లో టికెట్లపై వైకాపా నేతలకు ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టీకరణ

వారసుల ఆరంగేట్రానికి సిద్ధం చేసుకున్న వైకాపా ఎమ్మెల్యేలు, నేతల్లో అంతర్మథనం

వచ్చే ఎన్నికల్లో మీరే పోటీ చేయాలన్న సీఎం వ్యాఖ్యలపై చర్చ

ఇప్పటికే నియోజకవర్గాల్లో చురుగ్గా ఉన్న యువ నాయకులకు ఝలక్‌

ఈనాడు - అమరావతి

‘మీ వారసులను ప్రమోట్‌ చేసుకోండి. కానీ, వచ్చే ఎన్నికల కోసం మాత్రం వద్దు. వచ్చే ఎన్నికల్లో మీరే పోటీ చేయాలి’ అని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను అంతర్మథనంలోకి నెట్టాయి. వచ్చే ఎన్నికల్లో తమ వారసుల ఆరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకున్న పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక సందిగ్ధావస్థలో పడ్డారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఇప్పటికే నియోజకవర్గాల్లో చురుగ్గా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న నేతల వారసులు ఇప్పుడేం చేస్తారనేదీ ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో వారసులు కాదు మీరే పోటీ చేయాలని ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం స్పష్టం చేయడానికి కారణాలేంటన్న చర్చ వైకాపా వర్గాల్లో జరుగుతోంది.

ప్రయోగాలు మంచిది కాదనేనా?
వచ్చే ఎన్నికల్లో ప్రయోగాలు మంచిది కాదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వారసులను దించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. ‘రానున్న ఎన్నికలను సీఎం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొత్త ముఖాలను బరిలోకి దింపి ప్రయోగాలు చేస్తే ఇబ్బందికర పరిస్థితులకు దారితీయొచ్చు. అలాంటి పరిణామాలు ఎదురవకుండా ఉండేందుకు అటు ప్రజలు, ఇటు పార్టీ శ్రేణులతో ప్రత్యక్ష సంబంధాలున్న సిట్టింగులనే బరిలోకి దించడం సమంజసంగా ఉంటుంది’ అని వైకాపా నేతలు విశ్లేషిస్తున్నారు. వైకాపాకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐప్యాక్‌ సంస్థతోపాటు ఒకట్రెండు ఇతర సంస్థల ద్వారా చేయించిన సర్వేల ఆధారంగానే ముఖ్యమంత్రి ఈ నిర్ణయానికి వచ్చారంటున్నారు.

అప్పుడే పోటీకి ఎందుకు దూరమవ్వాలనుకుంటున్నారు?
అధికార పార్టీ ఎమ్మెల్యేలైనప్పటికీ ఒకరిద్దరు వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని ఇప్పటికే ప్రకటించారు. మరికొందరు వచ్చే ఎన్నికల్లో వారి వారసులను బరిలోకి దించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అధికారపక్ష ఎమ్మెల్యేలుగా ఒక టర్మ్‌కే వీరు తాము దూరంగా ఉండి, వారసులను తెరపైకి తీసుకొచ్చేందుకు ఎందుకింత తొందరపడుతున్నారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘అధికారంలో ఉన్నాం కాబట్టి వారసులను గెలిపించుకోగలిగితే వాళ్లు రాజకీయంగా స్థిరపడిపోతారు’ అన్న ఆలోచనతో వారు ఇలా చేస్తున్నారన్న ఓ విశ్లేషణ వినిపిస్తోంది. తమ అనుభవానికి పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని అలాంటప్పుడు తాము కొనసాగడం కంటే ఆగిపోవడం మంచిదనే ఉద్దేశంతోనే ఇలా వారసులను తెరపైకి తీసుకువస్తున్నారన్న చర్చ ఉంది.

‘సారీ’ అందరికా.. కొందరికేనా?
వారసులకు టికెట్‌ లేదన్న ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం టికెట్‌ ఆశిస్తున్న అందరికీ వస్తుందా? లేదా పరిస్థితులను బట్టి కొందరికి మినహాయింపు ఉంటుందా అనే విషయమూ చర్చనీయాంశమైంది. కొందరు వయోభారం, మరికొందరు ఆరోగ్య కారణాలు, ఇంకొందరు పని ఒత్తిడి అనే కారణాలతో వారసులను తెరపైకి తీసుకువస్తున్నారు. ఇలాంటివారికి మినహాయింపు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.

ఇప్పటికే ముందుకెళ్లిన వారసులు...
* నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ కుమారుడు, పోలాకి జడ్పీటీసీ సభ్యుడు డాక్టర్‌ కృష్ణ చైతన్య
* శాసనసభాపతి, ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి వెంకటనాగ్‌

* శాసనసభ ఉప సభాపతి, విజయనగరం శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె, విజయనగరం డిప్యూటీ మేయర్‌ శ్రావణి
* యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు కుమారుడు సుకుమార్‌ వర్మ

* తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు, తిరుపతి డిప్యూటీ మేయర్‌ అభినయ్‌రెడ్డి నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

* రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కుమారుడు నరేన్‌, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్‌ చురుగ్గా తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ మా కంటే మాకు అన్నట్లుగా రెండు వర్గాలూ పనిచేస్తున్నాయి.

* ఎమ్మెల్సీ, మండపేట వైకాపా సమన్వయకర్త తోట త్రిమూర్తులు కుమారుడు పృథ్వీరాజ్‌ మండపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల పరిధిలో రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు.

* మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మొదట్లో కొద్దిరోజులు ఆయనే నిర్వహించారు.

* ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి పల్లెబాట పేరుతో నియోజకవర్గ పరిధిలోని కొత్తపట్నం, అల్లూరు ప్రాంతాల్లో, ఒంగోలులోని ఒకట్రెండు డివిజన్లలో ఆరేడు నెలల కిందట విస్తృతంగా తిరిగారు. ఇంటి దగ్గర ప్రజాదర్బార్‌ నిర్వహించి వివిధ సమస్యలు, పనులపై వచ్చేవారి విజ్ఞప్తుల పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి.

* వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇటీవలే ప్రకటించారు.

* శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కుమారుడు తండ్రితో సంబంధం లేకుండానే సొంతంగానే నియోజకవర్గంలో తిరుగుతూ, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ అధిష్ఠానం అనుమతిస్తే తన కుమారుణ్ని బరిలో నిలుపుతానని చక్రపాణిరెడ్డి గతంలో బహిరంగంగానే ప్రకటించారు.

* ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈసారి మళ్లీ బరిలో దిగేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. జగన్‌ 2014లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే నియోజకవర్గంలో తన కుమారుడు తరుణ్‌రెడ్డి లేదా తన అన్న కుమారుడు ప్రతాప్‌రెడ్డిల్లో ఎవరికో ఒకరికి టికెట్‌ కావాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

* గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా తండ్రితోపాటు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెకు టికెట్‌ ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే బహిరంగంగానే చెబుతున్నారు.

* ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు అనురాధ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు కార్పొరేటర్‌ వంశీ కూడా తండ్రితోపాటు రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరు కూడా టికెట్‌ ఆశిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.


వీరు కాస్త నెమ్మదించారెందుకో?

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తండ్రులతోపాటు, కొన్ని సందర్భాల్లో సొంతంగానూ రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న కొందరు వారసులు ఇటీవల నెమ్మదించారు. వారసులతోపాటు వచ్చి తనను కలిసిన సీనియర్‌ నేతలకు ఈ ఎన్నికల్లో మీ బిడ్డలకు టికెట్‌ ఇవ్వలేనంటూ సీఎం స్పష్టం చేయడం వల్లే వీరిలో ఒకరిద్దరు వెనక్కి తగ్గారంటున్నారు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్‌మనోహర్‌ నాయుడు, పాణ్యంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కుమారుడు నరసింహారెడ్డి లాంటివారు ఈ జాబితాలో ఉన్నారు. కరోనా సమయంలో విజయనగరం, చీపురుపల్లిల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడు డాక్టర్‌ సందీప్‌ వచ్చే ఎన్నికల్లో బరిలో నిలుస్తారన్న చర్చ జోరుగా సాగింది. అయితే సందీప్‌ రాజకీయ కార్యకలాపాల్లో ఎక్కడా కనిపించడం లేదు.


వారసులు వద్దనడానికి కారణాలేంటి?

ఐప్యాక్‌తోపాటు ఇతర సర్వే సంస్థలు వారసులను పోటీలోకి దింపవద్దనడానికి చెప్పిన ప్రధాన కారణాలివీ..
* తండ్రా, కుమారుడా ఎవరైతే మేలు అంటే తండ్రులకే ప్రజల నుంచి ఎంతో కొంత సానుకూలత రావడం.
* వారసుల గ్రాఫ్‌ ఏ మాత్రం బాగాలేకపోవడం.

* తండ్రులకు కాకుండా కుమారులకు ఇస్తే కచ్చితంగా ఓడిపోతారని సర్వేల్లో రావడం.
* కొంతమంది వారసులు వారి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడం.

* నియోజకవర్గాల్లో వారసులకు పట్టు లేకపోవడం.
* ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలతో అసలు సంబంధాలు లేకపోవడం. వారితో దురుసుగా వ్యవహరిస్తుండటం.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts