తెలంగాణ ఉద్యమంలో వారి జాడేది?

తెలంగాణ ఉద్యమంలో జాడలేని చాలామంది ప్రతిపక్ష ఉత్తర కుమారులు ప్రగల్భాలు పలుకుతున్నారని, అవాకులు, చెవాకులు పేలుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిరోజూ అదేపనిగా, అనవసర విమర్శలు చేస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీరామారావు శుక్రవారం ట్విటర్‌లో ధ్వజమెత్తారు.

Published : 01 Oct 2022 06:37 IST

ప్రతిపక్ష ఉత్తర కుమారుల అవాకులు, చెవాకులు
రేవంత్‌, సంజయ్‌, షర్మిల, ప్రవీణ్‌లపై మంత్రి కేటీఆర్‌ ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో జాడలేని చాలామంది ప్రతిపక్ష ఉత్తర కుమారులు ప్రగల్భాలు పలుకుతున్నారని, అవాకులు, చెవాకులు పేలుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిరోజూ అదేపనిగా, అనవసర విమర్శలు చేస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీరామారావు శుక్రవారం ట్విటర్‌లో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ఉద్యమ పోరాటం, నాయకత్వం, అనుభవం దక్షతలో వీసమెత్తు లేనివారు, ఉద్యమంలో శకుని పాత్ర పోషించినవారు కూడా వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ వద్ద చేపట్టిన సాగరహారానికి శుక్రవారంతో పదేళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్‌ చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భం.. లక్షల గొంతుకలు జైతెలంగాణ అని నినదించిన రోజు’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ... హడావిడి చేస్తున్న రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌, ప్రవీణ్‌కుమార్‌, షర్మిలలు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు..? వారి పాత్రేమిటని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘‘ఈనాడైనా, ఏనాడైనా తెరాస తెలంగాణ ప్రజల పట్ల నిబద్ధతతో ఉన్న పార్టీ. చిత్తశుద్ధితో ఉద్యమానికి దిక్సూచిగా నిలిచినా, పరిపాలనలో దేశానికి మార్గదర్శిగా ఎదిగినా దానికి కారణం కేసీఆర్‌ నాయకత్వమే. ఆచార్య జయశంకర్‌ చెప్పినట్లుగా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష. గులాబీ జెండా చేసిన పోరాట ఫలితం, విద్యార్థులు, ప్రజల ఆశీర్వాదం, త్యాగాల వల్లనే ఈరోజు స్వరాష్ట్రం సాకారమైంది’’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో తెలిపారు.

ప్రజాజీవితంలో 16 సంవత్సరాలు

ఈ సెప్టెంబరుతో తనకు ప్రజాజీవితంలో 16 సంవత్సరాలు పూర్తయినట్లు కేటీఆర్‌ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎనిమిదేళ్లు, ప్రభుత్వంలో పనిచేసిన 8 సంవత్సరాలు మరిచిపోలేని జ్ఞాపకాలు మిగిల్చాయని తెలిపారు.

అబార్షన్లపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం

పెళ్లయినా, కాకపోయినా అబార్షన్‌ చేయించుకొనే హక్కు మహిళలకు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని కేటీఆర్‌ అన్నారు. దీనిని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు