భూ దందాల్లో కేసీఆర్‌ కుటుంబం

నిజాం కాలం నుంచి హైదరాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పోలీసుల సహాయంతో సెటిల్‌మెంట్లు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు వందల ఎకరాల భూదందాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 01 Oct 2022 07:23 IST

సెటిల్‌మెంట్లు.. ధరణి పేరుతో కబ్జాలు
బయ్యారం ఉక్కు సాధ్యం కాదని ఏనాడో చెప్పాం
కేసీఆర్‌ అంతర్జాతీయ పార్టీ పెట్టినా అభ్యంతరం లేదు: కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: నిజాం కాలం నుంచి హైదరాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పోలీసుల సహాయంతో సెటిల్‌మెంట్లు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు వందల ఎకరాల భూదందాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ధరణి వచ్చాక ఏర్పడిన సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రప్రభుత్వానికి 4 లక్షల దరఖాస్తులు అందగా.. ఒక్కటీ పరిష్కరించలేదని మండిపడ్డారు. విదేశాలకు వెళ్లినవారు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి భూములను ధరణి పేరుతో తెరాస నాయకులు కబ్జా చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారని తెలిపారు. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఈ అంశంపై నిపుణుల కమిటీ వేసి, అక్కడి ముడి ఇనుము.. ఉక్కు తయారీకి పనికిరాదని కమిటీ తేల్చిందన్నారు. వై.ఎస్‌. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని తేల్చారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.  నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, సచివాలయానికి రాకపోవడం, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చేయకపోవడమే తెలంగాణ మోడలా అని ఆయన ప్రశ్నించారు. ఈ మోడల్‌ తెచ్చేందుకే జాతీయ పార్టీ పెడుతున్నారా తెలపాలన్నారు. కేసీఆర్‌ అంతర్జాతీయ పార్టీ పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. సొంత విమానంలో అసదుద్దీన్‌ ఒవైసీ, అక్బరుద్దీన్‌ ఒవైసీలను ఎక్కించుకొని దేశ పర్యటనకు వెళతారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం వివక్ష చూపనందునే అవార్డులొస్తున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts