జగన్‌ రాక్షస పాలనపై పోరాడాలి

వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులంతా సమష్టిగా పోరాడాలి, దూకుడు పెంచాలని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

Published : 01 Oct 2022 06:40 IST

ఎవరికి వారే అన్నట్టుగా ఉంటే కుదరదు.. దూకుడు పెంచాలి

ఉమ్మడి గుంటూరు జిల్లా తెదేపా నాయకుల సమావేశంలో చంద్రబాబు స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులంతా సమష్టిగా పోరాడాలి, దూకుడు పెంచాలని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులపై పోలీసులు ఇష్టానుసారం అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నా జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల్లో పెద్దగా స్పందన ఉండటం లేదన్నారు. పోలీసు హెడ్‌క్వార్టర్‌, సీఐడీ కార్యాలయం గుంటూరు జిల్లా పరిధిలోనే ఉన్నప్పటికీ జిల్లా నాయకులు సీరియస్‌గా తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్యాయంగా వేధిస్తున్న పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టాలని సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో చంద్రబాబు శుక్రవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాలోని నాయకులంతా కలసి ఇంతవరకు సమావేశం ఏర్పాటు చేసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జిల్లా విభజన జరిగాక మీరంతా సమష్టిగా కార్యక్రమాలు చేయడం లేదు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది. ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. వారి తరఫున మీరు ఇంకా సమర్థంగా పోరాడాలి. ముందస్తు వ్యూహంతో పనిచేయాలి...’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరి, వినుకొండ, గురజాల నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు మెరుగ్గా ఉందని, మిగతా నియోజకవర్గాల్లో అలా ఎందుకు జరగడం లేదని ఆయన నిలదీశారు.

నిత్యం జనంలోనే ఉండాలి
‘‘రాజకీయ నాయకులు నిత్యం జనంలో ఉండాలి. గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు జనంలోకి వెళ్లకపోతే ఎలా? జిల్లాలో ఏదైనా సంఘటన జరిగితే 17 నియోజకవర్గాల్లోనూ స్పందించాలి. రాష్ట్రాన్ని ఒక రాక్షసుడు పాలిస్తున్నాడు. రాజకీయాల్ని నాశనం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో సీరియస్‌ పాలిటిక్స్‌ చేస్తేనే ముందుకు వెళ్లగలం. గుంటూరు ఎంతో రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా. అలాంటి చోట ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తీవ్రంగా స్పందించకపోతే ఎలా? రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే జరిగే నష్టాన్ని ఇంకా సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి...’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సమావేశానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి లోకేశ్‌ తప్ప మిగతా నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ హాజరయ్యారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వీల్‌ఛైర్‌లో వచ్చారు.

వచ్చే ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రాయపాటి
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాయపాటి సాంబశివరావు తెలిపారు. చంద్రబాబుతో సమావేశం అనంతరం తనను కలసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వారడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ... ‘‘మా వారసులు కూడా టికెట్‌లు ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయాలా? వద్దా? అన్నది చంద్రబాబు నిర్ణయిస్తారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధిస్తుంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 125 స్థానాల్లో తెదేపా గెలుస్తుంది...’’ అని ఆయన పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని