‘దసపల్లా’పై పార్టీల ధ్వజం..

దసపల్లా హిల్స్‌లో జరుగుతున్న భూ కుంభకోణం విలువ రూ.4 వేల కోట్లని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ రాజు ఆరోపించారు.

Published : 01 Oct 2022 05:06 IST

ఆ భూముల విలువ రూ.4 వేల కోట్లు: విష్ణుకుమార్‌రాజు

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: దసపల్లా హిల్స్‌లో జరుగుతున్న భూ కుంభకోణం విలువ రూ.4 వేల కోట్లని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ రాజు ఆరోపించారు. విశాఖలోని లాసన్స్‌బే కాలనీలోని భాజపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదే భూమి విషయంలో ప్రస్తుత వైకాపా మంత్రి విపక్షంలో ఉండగా పోరాడలేదా అని గుర్తుచేశారు. భవిష్యత్తులో తాము దీనిపై పోరాడి నిర్మాణాలు జరిగినా కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ భూముల విలువ రూ.2 వేల కోట్లని చెబుతున్నారు.. కానీ రూ.4 వేల కోట్లని అన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు చేయకూడదని ఎన్నికల కమిషన్‌ ఆదేశించినా ఎన్నికలకు సంబంధించి ఇంటింటికీ వెళ్లి పేర్లు నమోదు చేస్తున్నారని, దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని, అవసరమైనపుడు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్‌వర్మ పాల్గొన్నారు.


సీబీఐకి జనసేన కార్పొరేటర్‌ ఫిర్యాదు

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: విశాఖ నగరంలోని రూ.వేల కోట్ల విలువైన దసపల్లా భూములపై విచారణ జరిపించాలని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం విశాఖలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దసపల్లా లేఅవుట్‌లో సర్వే నంబర్లు 1196, 1197, 1027, 1028లలో సుమారు 60 ఎకరాల భూములున్నాయన్నారు. వాటిలో 40 ఎకరాలు జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, తూర్పు నావికాదళం సేకరించాయని, 5 ఎకరాలను ప్రభుత్వం వివిధ అవసరాలకు వినియోగిస్తోందని చెప్పారు. మిగిలిన 15 ఎకరాల భూమి కొన్నేళ్లుగా వివాదాల్లో ఉందని అన్నారు. ఎస్టేట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ భూములను అప్పటి అసిస్టెంట్‌ సెటిల్‌మెంట్‌ అధికారి గ్రౌండ్‌ రెంట్‌ పట్టాలను జారీ చేశారన్నారు. వీటిపై 1981లో అప్పటి తహసీల్దార్‌ సర్వే అండ్‌ సెటిల్‌మెంట్‌ కోర్టులో అప్పీలు చేయగా, అప్పటి సర్వే శాఖ సెటిల్‌మెంట్‌ గ్రౌండ్‌ రెంట్‌ పట్టాలను రద్దు చేసి ఈ భూములు ప్రభుత్వానివని తేల్చిందని వివరించారు. 2001లో సర్వేశాఖ దసపల్లా భూములను 22ఎ జాబితాలో చేరుస్తూ జీవో 657 జారీ చేసిందన్నారు. ఈ భూములను కాజేసేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులు కొన్నేళ్లుగా విశ్వప్రయత్నాలూ చేస్తున్నారన్నారు. అధికార పార్టీ అండతో ఈ భూములకు సంబంధించి ఇప్పటికే పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌ జరిగిందని, గతంలో అక్రమంగా వీటిని రిజిస్ట్రేషన్లు చేసుకున్న 60 మంది నుంచి ఎష్యూర్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీ పేరిట రాత్రికి రాత్రి కంపెనీని ఏర్పాటు చేసి డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్లు ఆరోపించారు. దానికి రిజిస్ట్రేషన్‌ కూడా చేశారని, 16 ఎకరాల్లో భవన సముదాయం నిర్మించేందుకు, టీడీఆర్‌లు తీసుకునేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారని కూడా ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని