రాజ్యాంగ రక్షణకే యాత్ర

‘భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. హింసాత్మక విధానాలను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకే భారత ఐక్యతా యాత్రను చేపట్టాల్సి వచ్చింది’ అని ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ తెలిపారు.

Updated : 01 Oct 2022 05:58 IST

రాహుల్‌ గాంధీ

ఈనాడు, బెంగళూరు: ‘భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. హింసాత్మక విధానాలను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకే భారత ఐక్యతా యాత్రను చేపట్టాల్సి వచ్చింది’ అని ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ తెలిపారు. ఆయన చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం కేరళ నుంచి కర్ణాటక చేరుకున్నారు. ఈ సందర్భంగా చామరాజనగర జిల్లా గుండ్లుపేటెలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘కేంద్ర ప్రభుత్వ ప్రమాదకరమైన విధానాలను ప్రశ్నించేందుకు పార్లమెంట్‌లో అవకాశం ఇవ్వని పరిస్ధితి. కేంద్రాన్ని నిలదీసేందుకు పాదయాత్ర తప్ప మరో మార్గం కనిపించలేదు. ఈ యాత్రలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. నిరుద్యోగం, ధరల పెంపు, రైతు వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణపై ప్రజలు ఎంతగా విసిగెత్తిపోయారో ఈ యాత్రద్వారా నాకు తెలిసొచ్చింది. సుదీర్ఘ సంభాషణల కంటే ప్రజల సమస్యలను ఆలకించటమే దీని లక్ష్యం. ప్రజా సమస్యల అవగాహన యాత్రను ఎవరూ అడ్డుకోలేరు’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్‌, విపక్ష నేత సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకలో 21 రోజుల్లో 531 కిలోమీటర్ల పొడవున ఈ యాత్ర కొనసాగుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని