దిగ్విజయ్‌ కాదు.. ఖర్గే

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పోటీ నుంచి తప్పుకోవడం, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే నామినేషన్‌ దాఖలు చేయడం చకచకా జరిగిపోయాయి.

Updated : 01 Oct 2022 07:04 IST

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో నాటకీయ పరిణామం
అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకొన్న దిగ్విజయ్‌ సింగ్‌
మల్లికార్జున్‌ ఖర్గేకు మద్దతు ప్రకటన
నామినేషన్‌ దాఖలు చేసిన ఖర్గే, శశిథరూర్‌
బరిలో కె.ఎన్‌.త్రిపాఠి కూడా..
రాజ్యసభలో ప్రతిపక్ష నేతకే విజయావకాశాలు!

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పోటీ నుంచి తప్పుకోవడం, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే నామినేషన్‌ దాఖలు చేయడం చకచకా జరిగిపోయాయి. మరోవైపు ముందుగా ప్రకటించినట్లే తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ ఎన్నికల బరిలో దిగారు. ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కె.ఎన్‌.త్రిపాఠి కూడా నామపత్రాలు సమర్పించడంతో.. హస్తం పార్టీ అధ్యక్ష ఎన్నిక త్రిముఖ పోరుగా మారింది. వీరిలో ఖర్గేకు గాంధీ కుటుంబం అండ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానంపై అసమ్మతి గళం వినిపించిన జి-23 బృందంలోని ఆనంద్‌ శర్మ, పృథ్వీరాజ్‌ చవాన్‌, మనీశ్‌ తివారీ, భూపీందర్‌ హుడా తదితర నేతలూ ఆయనకే మద్దతు తెలిపారు. దీంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఖర్గే ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

దిగ్విజయ్‌ తప్పుకొని..

అధ్యక్ష ఎన్నికల బరి నుంచి రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ వైదొలిగిన తర్వాత.. గాంధీ కుటుంబం మద్దతుతో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ పోటీలో దిగుతున్నట్లు వార్తలొచ్చాయి. నామినేషన్‌ దాఖలు కోసం సంబంధిత పత్రాలను కూడా ఆయన స్వీకరించారు. దీంతో థరూర్‌, దిగ్విజయ్‌ మధ్య ద్విముఖ పోటీ ఉంటుందని అంతా ఊహించారు. అయితే తాను బరిలో దిగడం లేదని శుక్రవారం ఆయన అనూహ్యంగా ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా ఖర్గేను తాను గురువారం కోరానని, అందుకు ఆయన నిరాకరించారని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఖర్గే పోటీ చేయడం ఖరారవడంతో, ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తాను తప్పుకొంటున్నట్లు చెప్పారు. గహ్లోత్‌ కూడా ఖర్గేకే మద్దతు ప్రకటించారు. కె.ఎన్‌.త్రిపాఠి గతంలో కాంగ్రెస్‌ అనుబంధ సంస్థ ‘ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (త్రిపాఠి వర్గం) జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.

గాంధీ కుటుంబసభ్యుల గైర్హాజరు

దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల ప్రాధికార సంస్థ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీకి ఖర్గే, థరూర్‌, త్రిపాఠి నామపత్రాలు సమర్పించారు. పార్టీకి చెందిన ఎక్కువ మంది నేతలు ఖర్గే వెంట తరలిరావడం కనిపించింది. గాంధీ కుటుంబం నుంచి మాత్రం ఎవరూ ఆ కార్యాలయానికి రాలేదు. నామపత్రాల సమర్పణ గడువు శుక్రవారంతో ముగిసింది. అధ్యక్ష ఎన్నిక ఈ నెల 17న జరుగుతుంది. 19న ఫలితం వెల్లడవుతుంది. పార్టీకి చెందిన 9,100 మందికిపైగా ప్రతినిధులు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.

ఖర్గే.. కొనసాగింపు అభ్యర్థి: థరూర్‌

కాంగ్రెస్‌లో మార్పును కోరుకునేవారు తనకు ఓటెయ్యాలని థరూర్‌ పిలుపునిచ్చారు. ఖర్గే గెలిస్తే యథాతథ స్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఆయన్ను ప్రస్తుత స్థితికి ‘కొనసాగింపు అభ్యర్థి’గా వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల్లో నామపత్రాల సమర్పణ అనంతరం థరూర్‌ విలేకర్లతో మాట్లాడారు. ఖర్గేను అధిష్ఠానం తరఫు అభ్యర్థిగా పేర్కొంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తనకు తెలుసన్నారు. అయితే ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ తాము ఎవరికీ మద్దతివ్వడం లేదని గాంధీ కుటుంబం తనకు పలుమార్లు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఖర్గే కాంగ్రెస్‌లో భీష్మ పితామహుడి వంటివారని థరూర్‌ వ్యాఖ్యానించారు. తమ మధ్య జరగబోయేది స్నేహపూర్వక పోటీయేనని స్పష్టం చేశారు.


అందరూ ప్రోత్సహించారు

ధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కీలక రాష్ట్రాల నుంచి పార్టీ నేతలు, ప్రతినిధులు, కార్యకర్తలు నన్ను ప్రోత్సహించారు. నామపత్రాలు సమర్పించే సమయంలో నా వెంట ఉన్నవారందరికీ ధన్యవాదాలు.

- ఖర్గే

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts