దసపల్లా భూములపై విజయసాయి వల

విశాఖ నగరానికి నడిబొడ్డున ఉన్న, రూ.2 వేల కోట్లకు పైగా విలువైన దసపల్లా భూముల్ని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తన బినామీల్ని అడ్డుపెట్టుకుని.. అడ్డగోలుగా కొట్టేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం తెదేపాతో పాటు, జనసేన, సీపీఐ ఆరోపించాయి.

Updated : 02 Oct 2022 09:27 IST

కుమార్తెకూ, అల్లుడికీ కట్టబెడుతున్నారు

ఉమేష్‌, గోపీనాథ్‌రెడ్డి ఆయన బినామీలే

వాళ్లతో ఎష్యూర్‌ కంపెనీ ఏర్పాటు చేయించారు

కుమార్తె, అల్లుడి కంపెనీ నుంచి నిధుల బదిలీ

తెదేపా, జనసేన, సీపీఐ ఆరోపణ.. దసపల్లా భూముల్లో నిరసన

విశాఖపట్నం (వన్‌టౌన్‌), కార్పొరేషన్‌- న్యూస్‌టుడే: విశాఖ నగరానికి నడిబొడ్డున ఉన్న, రూ.2 వేల కోట్లకు పైగా విలువైన దసపల్లా భూముల్ని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తన బినామీల్ని అడ్డుపెట్టుకుని.. అడ్డగోలుగా కొట్టేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం తెదేపాతో పాటు, జనసేన, సీపీఐ ఆరోపించాయి. విజయసాయిరెడ్డి తన బినామీలతోపాటు, కుమార్తె, అల్లుడితో కంపెనీల్ని ఏర్పాటు చేయించి, వారికి ఆ భూముల్ని దోచిపెడుతున్నారని మండిపడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో 22(ఎ) జాబితాలో చేర్చి కాపాడుతూ వచ్చిన ఆ భూముల్ని విజయసాయిరెడ్డి పక్కా ప్రణాళికతో కొట్టేస్తున్నారని ధ్వజమెత్తాయి. దసపల్లా భూముల పరిరక్షించాలంటూ ప్రతిపక్షాలన్నీ శనివారం ర్యాలీలు, నిరసనలతో హోరెత్తించాయి. ఆ భూముల్ని కొట్టేయడానికేనా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తామని ప్రకటించిందని ధ్వజమెత్తాయి. ‘విజయసాయిరెడ్డి ఏర్పాటు చేసిన ట్రస్ట్‌లో విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి ఉమేష్‌, వస్త్రదుకాణ యజమాని గోపీనాథ్‌రెడ్డి సభ్యులు. విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేస్తామని వైకాపా ప్రభుత్వం ప్రకటించాక... అత్యంత విలువైన దసపల్లా భూములపై విజయసాయిరెడ్డి కన్ను పడింది. వాటిని కొట్టేసేందుకు మొదట తన బినామీలైన ఉమేష్‌, గోపీనాథ్‌రెడ్డిలతో ఒక కంపెనీని.. అల్లుడు, కుమార్తెలతో మరో కంపెనీని ఏర్పాటు చేయించారు. దసపల్లా భూముల్ని కొనుక్కున్న వారితో వాటిని తన బినామీల కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలకయ్యే డబ్బును తన కుమార్తె, అల్లుడి కంపెనీ నుంచి బినామీల కంపెనీకి పంపించారు. ఇప్పుడు ఆ భూముల్ని 22(ఎ) జాబితా నుంచి తొలగించి స్వాధీనం చేసుకోబోతున్నారు’ అని తెదేపా, జనసేన, సీపీఐ పార్టీల నాయకులు ఆరోపించారు. తెదేపా, సీపీఐ శనివారం వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టగా, జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ విలేకర్ల సమావేశంలో... దసపల్లా భూముల్లో కుట్ర కోణాన్ని వివరించారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మూడు పార్టీలు డిమాండ్‌ చేశాయి.

అల్లుడికి, కూతురికి దోచిపెట్టేందుకేనా అన్ని కబుర్లు

దసపల్లా భూముల్ని బినామీల పేరుతో కుమార్తె, అల్లుడికి దోచిపెట్టేందుకు విజయసాయిరెడ్డి కుట్ర పన్నారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు. వాటికి బలం చేకూర్చే పత్రాల్నీ ఆయన బయటపెట్టారు. ‘విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించాక.. వివాదాస్పద భూముల వ్యవహారాల్లో నాకు భాగస్వామ్యం ఉందంటూ, అధికారుల దగ్గర కొందరు నా పేరు వాడుకుని ప్రయోజనం పొందాలని చూస్తున్నారని చాలా మంది చెప్పారు. నేను విశాఖకు వచ్చినప్పటి నుంచి ఆస్తి వివాదాన్ని పరిష్కరించాలని ఒక్క అధికారికీ చెప్పిన దాఖలాల్లేవు. భవిష్యత్తులోనూ చెప్పను. అది నా నియమాలకు విరుద్ధం. నా పేరు చెప్పి మీ దగ్గరకు ఎవరైనా వస్తే క్రిమినల్‌ కేసు పెట్టండి’- అంటూ విజయసాయిరెడ్డి గతంలో అధికారులకు చేసిన సూచనను మూర్తి యాదవ్‌ గుర్తి చేశారు. కుమార్తెకు, అల్లుడికి అంత విలువైన భూముల్ని దోచిపెడుతున్నందుకు ఇప్పుడు ఎవరిపై కేసు పెట్టాలని ప్రశ్నించారు. ‘2019 డిసెంబరు 17న ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల ప్రకటన చేయగా, కూనపరెడ్డి ఉమేష్, ఆయన భార్య లక్ష్మి డైరెక్టర్లుగా 2020 జనవరి 6న ‘వైజాగ్‌ కోస్ట్‌ రిసార్ట్స్‌ ఎల్‌ఎల్‌పీ’ పేరుతో విశాఖలోని సీతమ్మధార చిరునామాతో ఒక కంపెనీని ఏర్పాటు చేయించారు. 2021 జూన్‌ 12న వస్త్ర వ్యాపారి శ్రియపురెడ్డి గోపీనాథ్‌రెడ్డిని మరో డైరెక్టర్‌గా చేర్చారు. కంపెనీ పేరును ఎష్యూర్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీగా మార్చారు. 2020 సెప్టెంబరు 7న తన కుమార్తె పెనక నేహారెడ్డి, అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి డైరెక్టర్లుగా అవ్యాన్‌ రియల్టర్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే కంపెనీని ఏర్పాటు చేయించారు. దసపల్లా భూముల్ని కొన్న 64 మందితో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేయించుకున్నారు. పి-595/2021 (2021 జూన్‌ 24న), పి-783/2021 (2021 ఆగస్టు 10), పి-985/2021 (2021 సెప్టెంబరు 27) అనే నంబర్లతో మూడు డాక్యుమెంట్లుగా రిజిస్ట్రేషన్‌ చేయించారు. అక్కడ 65,396.36 చ.గజాల స్థలం ఉందని, చ.గజం రిజిస్ట్రేషన్‌ విలువ రూ.86,000గా పేర్కొన్నారు. దాని రిజిస్ట్రేషన్‌కు రూ.9.75 కోట్లు స్టాంప్‌ డ్యూటీగా చెల్లించారు. ఆ డబ్బు అవ్యాన్‌ రియల్టర్స్‌ నుంచి ఎష్యూర్‌ డెవలపర్స్‌కు మళ్లించినట్లు ఆధారాలున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఆ భూముల్ని నిషిద్ధ జాబితా నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు’ అని మూర్తి యాదవ్‌ పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడు ఎష్యూర్‌ రియల్టర్స్‌ కంపెనీని కేవలం రూ.లక్ష మూలధనంతో ఏర్పాటు చేశారని, అలాంటి కంపెనీ ఏర్పాటైన కొన్ని నెలల్లోనే మరో కంపెనీకి రూ.9.75 కోట్లు ఎలా పంపించగలదని మూర్తియాదవ్‌ ప్రశ్నించారు. అవి కేవలం దసపల్లా భూముల్ని కొట్టేయడానికి ఏర్పాటు చేసిన బినామీ కంపెనీలనడానికి ఇదే నిదర్శనమన్నారు. ‘ఆ భూముల్లో 27.55 లక్షల చ.అడుగుల నిర్మాణాలు చేపడతామని, అది కాకుండా పార్కింగ్‌కు 8.60 లక్షల చ.అడుగులు కేటాయిస్తామని అగ్రిమెంట్‌లో పేర్కొన్నారు. ఆ స్థలాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ అతిథిగృహాన్ని, జీవీఎంసీ వాటర్‌ ట్యాంక్‌ను కూడా మింగేస్తారేమో? నగరాన్ని దోచుకుంటున్న ముఖ్యమంత్రి, విజయసాయిరెడ్డి, పక్క జిల్లాకు చెందిన మంత్రి దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?’ అని ధ్వజమెత్తారు. విలేకర్ల సమావేశంలో జనసేన నాయకులు ఉషాకిరణ్, శ్రీరెడ్డి, ప్రశాంతి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

అమర్నాథ్‌ నాడు డిమాండ్‌ చేసినట్టే సీబీఐ విచారణ జరపాలి


దసపల్లా భూములపై సీబీఐ విచారణ జరపాలని ప్రస్తుతం మంత్రి గుడివాడ్‌ అమర్నాథ్‌ అప్పట్లో విపక్ష నేతగా డిమాండ్‌ చేశారని, ఇప్పుడు అధికారంలో వైకాపా ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆయన డిమాండ్‌ మేరకే సీబీఐ విచారణ జరపాలని తెదేపా నేతలు పేర్కొన్నారు. శనివారం ఉదయం గవర్నర్‌ బంగ్లా నుంచి దసపల్లా భూముల వరకు ర్యాలీగా వెళ్లి మంచినీటి రిజర్వాయర్‌ పైకెక్కి నిరసన తెలిపారు. ‘రూ.1500 కోట్ల విలువైన దసపల్లా భూముల్ని ప్రైవేటు వ్యక్తులు కాజేయాలని చూస్తున్నారు. దానిపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఫిర్యాదు చేశాం. దసపల్లా భూముల్ని బినామీల పేరుతో కాజేసింది తెదేపా నాయకులే’.. అంటూ అప్పట్లో అమర్నాథ్‌ ఆరోపించి, సీబీఐకి ఫిర్యాదు చేశారని తెదేపా విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గుర్తు చేశారు. ‘దసపల్లా భూములకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ జరిగినా.. భూయజమానికి 70 శాతం, డెవలపర్‌కు 30 శాతం ఇస్తారు. దసపల్లా భూములకు సంబంధించి డెవలపర్‌కు 70 శాతం, ఆ భూములు అనుభవిస్తున్నవారికి 30 శాతం వెళ్లేలా ఒప్పందం చేసుకున్నారు. అక్కడ డెవలపర్‌ విజయసాయిరెడ్డి కాబట్టే ఒప్పందం అలా జరిగింది. తమ భూముల్ని, స్థలాల్ని 22(ఎ) జాబితా నుంచి తప్పించాలంటూ విశాఖ ప్రజలు చేసుకున్న దరఖాస్తులు 1,500కిపైగా పెండింగ్‌లో ఉన్నాయి. వాళ్ల గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. దసపల్లా భూముల్ని మాత్రం 22(ఎ) నుంచి తప్పించేందుకు ఆగమేఘాల మీద ఉత్తర్వులు ఇచ్చేశారు. దీని వెనుక ఎవరున్నారు? అసలు దసపల్లా భూములకు వారసులు అంటున్నవారిపైనే మాకు సందేహాలున్నాయి. ఆ భూములకు యూఎల్‌సీ చట్టాన్ని వర్తింపజేయకపోవడమూ అనుమానాస్పదంగానే ఉంది’ అని పల్లా పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా దసపల్లా భూముల్లో భారీ భవనాలు నిర్మిస్తే.. తెదేపా అధికారంలోకి వచ్చాక వాటికి నోయిడాలోని ట్విన్‌ టవర్స్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. తెదేపా అధికారంలో ఉండగా దసపల్లా భూముల్ని రక్షిస్తే.. ఇప్పుడు వైకాపా నేతలు దోపిడీకి తెరతీశారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గండి బాబ్జీ, బండారు అప్పలనాయుడు, పుచ్ఛా విజయకుమార్, వీఎస్‌ఎన్‌ మూర్తి యాదవ్, విజయబాబు తదితరులు పాల్గొన్నారు.
రూ.వేల కోట్ల భూములను వైకాపా నేతలకు కట్టబెడుతున్నారు..
దసపల్లా భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు డిమాండ్‌ చేశారు. శనివారం దసపల్లా భూముల వద్ద సీపీఐ నిరసనలో ఆయన మాట్లాడారు. అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి రూ.వేల కోట్ల విలువైన భూములు వైకాపా నేతలకు కట్టబెట్టడం దారుణమన్నారు. మాట తప్పను, మడమ తిప్పనని గొప్పలు చెప్పిన సీఎం జగన్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్టీ నాయకులు ఎ.విమల, ఎస్‌కె రెహమాన్, రాంబాబు, చంద్రశేఖర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts