రాష్ట్రంలో జోడో యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘భారత్‌ జోడోయాత్ర’ తెలంగాణ రూట్‌ మ్యాప్‌ ఖరారైంది.

Published : 02 Oct 2022 04:55 IST

అనుమతి కోరుతూ డీజీపీకి రేవంత్‌, భట్టి వినతి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘భారత్‌ జోడోయాత్ర’ తెలంగాణ రూట్‌ మ్యాప్‌ ఖరారైంది. మక్తల్‌ నుంచి ప్రారంభమై దేవరకద్ర, మహబూబ్‌నగర్‌ టౌన్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, శంషాబాద్‌ మీదుగా ఆరాంఘర్‌, చార్మినార్‌, నాంపల్లి, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మియాపూర్‌, పటాన్‌చెరు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్‌ రోడ్స్‌, జోగిపేట, శంకరంపేట్‌, మద్నూర్‌ వరకూ జరగనుంది. అక్కడి నుంచి యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో 14 రోజులు 375 కి.మీ. మేర యాత్ర సాగనుంది.

పార్టీలకు అతీతంగా పాల్గొనాలి: రేవంత్‌
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం శనివారం సాయంత్రం రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసింది. రాష్ట్రంలో రాహుల్‌ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ను అందజేసి, అనుమతి ఇవ్వాలని, భద్రత కల్పించాలని కోరింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విలేకరులతో మాట్లాడారు. ‘భారత్‌ జోడో యాత్ర’ దేశ భవిష్యత్తును మార్చే యాత్ర అని.. అన్నారు. గద్దర్‌, విమలక్క, ప్రొ.నాగేశ్వరరావు తదితరులు, ప్రజా సంఘాలు, సోషలిస్టు పార్టీలు కూడా పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని కోరారు. అంతకుముందు.. ఈ యాత్రకు సంబంధించి మహారాష్ట్ర పరిశీలన బృందం రేవంత్‌రెడ్డి, మధుయాస్కీగౌడ్‌, ఇతర నేతలతో భేటీ అయింది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ నివాసంలో జరిగిన ఈ భేటీలో మహారాష్ట్ర సీఎల్పీ నేత బాలాసాహెబ్‌ థొరాట్‌ తదితరులు పాల్గొన్నారు. అందరూ బస్సులో వెళ్లి పాదయాత్ర కొనసాగనున్న రూట్‌ను పరిశీలించారు.

* ఎస్టీ రిజర్వేషన్ల అమలులో జరిగిన 8 సంవత్సరాల జాప్యంతో నష్టపోయిన గిరిజనులకు  సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని శనివారం డిమాండ్‌ చేశారు.

* ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులకు ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts