వైద్యకళాశాలలపై కిషన్‌రెడ్డివి అసత్యాలు

తెలంగాణకు వైద్య కళాశాలల మంజూరు విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు శనివారం ట్విటర్‌లో ధ్వజమెత్తారు.

Published : 02 Oct 2022 04:55 IST

గుజరాత్‌ బాస్‌ల కోసం తప్పుడు ప్రచారం

మంత్రి కేటీఆర్‌ ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణకు వైద్య కళాశాలల మంజూరు విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు శనివారం ట్విటర్‌లో ధ్వజమెత్తారు. తెలంగాణకు కేంద్రం 9  వైద్య కళాశాలలు మంజూరు చేసిందని కిషన్‌రెడ్డి చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదని, అది పూర్తిగా బూటకమని కేటీఆర్‌ అన్నారు. ‘‘ఓ సోదరుడిగా కిషన్‌రెడ్డిని ఎంతో గౌరవిస్తా. కానీ అసత్యాలను ప్రచారం చేయడం తగదు. కిషన్‌రెడ్డికి తన తప్పును అంగీకరించే ధైర్యం కూడా లేద’’ని కేటీఆర్‌ విమర్శించారు. ‘‘వైద్య కళాశాలల విషయంలో మీది పూర్తిగా దుష్ప్రచారం. హైదరాబాద్‌లో గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ముందు మీరే ప్రకటించారు. ఎప్పటిలాగే, మీ గుజరాతీ బాస్‌లు దానిని వారి రాష్ట్రానికి మార్చారు. ఇప్పటికీ హైదరాబాద్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. తప్పును మాత్రం దిద్దుకోవడం లేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తుంగలో తొక్కుతున్నదో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. గుజరాత్‌ బాసులను సంతోషపెట్టడానికి అర్ధ సత్యాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేసే వ్యక్తిగా మీరు మారారు’’  అని కిషన్‌రెడ్డిపై కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

ఎస్‌ఎన్‌డీపీపైనా అదే తీరు...
హైదరాబాద్‌ నగరంలో వరదం నియంత్రణ చేపట్టిన సమీకృత నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డీపీ)పైనా కిషన్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఎస్‌ఎన్‌డీపీ ద్వారా రూ.985 కోట్లతో వరద నియంత్రణ చర్యలను చేపట్టింది. అత్యధిక శాతం పనులు ఒకటి రెండు నెలల్లో పూర్తి కాబోతున్నాయి. సెప్టెంబరు30 నాటికి సుమారు రూ.103 కోట్లను జీహెచ్‌ఎంసీ నిర్మాణ సంస్థలకు చెల్లించింది. మరో రూ. 150 కోట్లు చెల్లించబోతోంది. మరో రూ. 200 కోట్ల పనులు తుది దశలో ఉన్నాయి. ఈ విషయాలను కిషన్‌రెడ్డి దాచి ఉంచారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల పైన కూడా ఆయనకి అవగాహన లేదు. పైగా జరిగిన పనులను జరగనట్లు ట్విట్టర్‌ ద్వారా పేర్కొనడం ముమ్మాటికి ప్రజలను తప్పుదోవ పట్టించడమే’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.


నేటితో బతుకమ్మ చీరల పంపిణీ పూర్తి: కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మహిళలకు బతుకమ్మ కానుకగా ఇస్తున్న చీరల పంపిణీ ఆదివారంతో పూర్తి కానుందని చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శనివారం వరకు 95 శాతం చీరల పంపిణీ పూర్తవగా మిగిలిన వాటిని ఆదివారం అందజేయనున్నట్లు వివరించారు. శనివారం ఉదయం ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘‘నూతన డిజైన్లతో 10 రంగుల మేళవింపుతో 240 రకాల చీరలను తయారు చేయించాం. అధికార యంత్రాంగం గత నెల 22వ తేదీ నుంచి వాటి పంపిణీని చేపట్టింది. వివిధ రంగులు, డిజైన్లతో కూడిన నాణ్యమైన చీరలను మహిళలు ఆనందంగా తీసుకుంటున్నారు’’ అని మంత్రి పేర్కొన్నారు. యునెస్కో  ఎంపిక చేసిన వాటిలో తెలంగాణకు చెందిన హిమ్రూ నేత, సిద్దిపేట గొల్లభామ నేత, గొర్రెల ఊలుతో నేసే గొంగళ్లకు చోటు లభించడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. కళానైపుణ్యానికి మారుపేరైన తెలంగాణ నేతన్నలకు దక్కిన అంతర్జాతీయ గౌరవమిది అని పేర్కొన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts