మునుగోడు ఉపఎన్నికకు 15లోపు నోటిఫికేషన్‌!

మునుగోడు ఉపఎన్నికలో అయిదంచెల వ్యూహాన్ని అనుసరించి విజయమే లక్ష్యంగా పనిచేయాలని కమలదళం నిర్ణయించింది.

Updated : 02 Oct 2022 06:22 IST

5 అంచెల వ్యూహంతో విజయం సాధించాల్సిందే

స్టీరింగ్‌ కమిటీ, మండల ఇన్‌ఛార్జులతో భేటీలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికలో అయిదంచెల వ్యూహాన్ని అనుసరించి విజయమే లక్ష్యంగా పనిచేయాలని కమలదళం నిర్ణయించింది. దసరా దర్వాత 7, 8 తేదీల నుంచి ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌.. పార్టీ స్టీరింగ్‌ కమిటీ నేతలు, మునుగోడు ఉపఎన్నికకు నియమించిన మండల ఇన్‌ఛార్జులతో శనివారమిక్కడ విడివిడిగా సమావేశం అయ్యారు. స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ వివేక్‌ వెంకటస్వామి, భాజపా అభ్యర్థిగా నిలిచే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కమిటీ సమన్వయకర్త గంగిడి మనోహర్‌రెడ్డితో పాటు సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్‌, గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, స్వామిగౌడ్‌, రవీంద్రనాయక్‌, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, సంకినేని వెంకటేశ్వరరావు, యెండల లక్ష్మీనారాయణ, దాసోజ్‌ శ్రవణ్‌ తదితరులు హాజరయ్యారు. మునుగోడు ఉపఎన్నికకు ఈనెల 15లోపు నోటిఫికేషన్‌ రావచ్చని, హిమాచల్‌ అసెంబ్లీతో పాటు ఇక్కడా నవంబర్‌ తొలి లేదా రెండోవారంలో ఎన్నిక జరగొచ్చని బన్సల్‌తో పాటు ఒకరిద్దరు నేతలు అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఉపఎన్నిక ప్రచారానికి వచ్చేందుకు  జేపీ నడ్డా, అమిత్‌షా సమయం ఇచ్చారని స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ వివేక్‌ వెంకటస్వామి చెప్పారు. ఉపఎన్నికకు సంబంధించి తాజాగా 15 కమిటీలు వేసినట్లు.. మేనిఫెస్టో కమిటీకి ఈటల రాజేందర్‌ను, ఛార్జిషీట్‌ కమిటీకి ధర్మపురి అర్వింద్‌ను ఛైర్మన్‌గా నియమించినట్లు పార్టీ నేత ఒకరు తెలిపారు.

5 అంచెల వ్యూహంలో భాగంగా.. 

ప్రతి పోలింగ్‌బూత్‌కు 21 మందితో కమిటీ. ప్రతి మండలంలో ముగ్గురు స్థానికేతర నాయకుల్ని ఇన్‌ఛార్జులుగా నియమించడం. ప్రతి మండలంలో 10 మంది నాయకులతో సమన్వయకమిటీ ఏర్పాటు. నియోజవర్గానికి ఎన్నికల ప్రణాళిక, ఛార్జిషీట్‌, బహిరంగ సభలు సహా 22 కమిటీలతో ముందుకు వెళ్లడం. కుల సమ్మేళనాల నిర్వహణ.. ప్రతి ఇంటికి వెళ్తూ, ఒక్కో ఓటరును ముమ్మారు కలిసేలా కమలనాథులు వ్యూహరచన చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని