పోలీసు వ్యవస్థను రాజకీయకక్ష సాధింపు సంస్థగా మార్చారు

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను జగన్‌ సర్కారు రాజకీయ కక్ష సాధింపు సంస్థగా మార్చిందని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. బీసీ నేత అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని శనివారం ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు.

Published : 02 Oct 2022 05:18 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి : రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను జగన్‌ సర్కారు రాజకీయ కక్ష సాధింపు సంస్థగా మార్చిందని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. బీసీ నేత అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని శనివారం ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు. ‘‘కోర్టు ఎన్ని చీవాట్లు పెట్టినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. హైదరాబాద్‌లో విజయ్‌ ఇంటికి ఎలాంటి నోటీసులు లేకుండా వెళ్లిన సీఐడీ పోలీసులు అక్రమ అరెస్టుకు యత్నించడం దారుణం. ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి కుటుంబసభ్యులు, ఇంట్లో పనిచేసే వాళ్లను బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేరాలు, ఘోరాలు చేస్తున్న వైకాపా నేతలకు మంత్రి పదవులిస్తూ.. ప్రజల పక్షాన పోరాడుతున్న తెదేపా వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారు. అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం...’’ అని నారా లోకేశ్‌ హెచ్చరించారు.

అమ్మఒడి కాదు అర్ధ ఒడి

అమ్మఒడి పథకాన్ని కుటుంబంలో ఒక్కరికే వర్తింపజేయడంపై ట్విటర్‌ వేదికగా ‘అమ్మఒడి కాదు..అర్ధఒడి’ అని నారా లోకేశ్‌ మండిపడ్డారు. ‘‘జగన్‌...మీ ఇద్దరు పిల్లలూ విదేశాల్లో చదువుతున్నారు కదా. వారిలో ఒక్కర్నే చదివించి. మిగిలిన ఒక్కర్ని పనికి పంపండి’’ అంటూ ట్వీట్‌ చేశారు. ‘పిల్లలను బడులకు పంపకుండా పనులకు పంపుతున్నారని జగన్‌ ‘అమ్మఒడి’ పథకాన్ని పెట్టారు. ఒక పిల్లాడ్ని బడికి పంపితే రూ.15వేలు, ఇద్దరు పిల్లల్ని పంపితే రూ.30 వేలు అమ్మఒడి కింద వస్తుంది’’ అని  ఎన్నికల ప్రచారంలో అమ్మఒడిపై వైఎస్‌ భారతి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తన ట్వీట్‌కు జత చేశారు. 

ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు, బెదిరింపులు, దాడులే సీఐడీ విధులా?

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టడం, బెదిరించడం, దాడులు చేయడమే రాష్ట్రంలో సీఐడీ విధులా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తెదేపా నేత చింతకాయల విజయ్‌పై అక్రమ కేసు నమోదు చేయడమే కాకుండా, ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఆయన ఇంట్లో బీభత్సం సృష్టించడం దుర్మార్గమని శనివారం ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు.‘‘జగన్‌రెడ్డి పెంపుడు చిలుకలా ఏపీ సీఐడీ తయారైంది. జగన్‌రెడ్డి మాటలు వినిగుడ్డిగా ముందుకు వెళితే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు తప్పవని సీఐడీ అధికారులు గుర్తుంచుకోవాలి. గతంలో విన్నవారంతా కోర్టు కేసులతో, జైలు శిక్షలతో పశ్చాత్తాపపడుతున్నారు. తప్పుడు కేసులపై కోర్టుల్లో పోరాడుతాం. తెదేపా నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటాం...’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

సీఐడీ పోలీసుల వ్యవహారశైలి రోజురోజుకూ దిగజారిపోతోంది: వర్ల రామయ్య

సీఐడీ పోలీసుల వ్యవహార శైలి రోజురోజుకూ దిగజారిపోతోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ‘‘హైదరాబాద్‌లోని విజయ్‌ ఇంటికి వెళ్లడం, ఐడీ కార్డులు చూపించకుండా ఇంట్లోని వారిని, చిన్న పిల్లల్నీ భయభ్రాంతులకు గురి చేయడం దారుణం. మళ్లీ వచ్చి సీసీటీవీ ఫుటేజీనీ ధ్వంసం చేయాలని చూడడం శిక్షార్హమైన నేరం. ఏపీ సీఐడీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి సంబంధిత అధికారులను వెంటనే అరెస్టు చేయాలి...’’ అని వర్ల రామయ్య శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

వైకాపా తొత్తుల్లా వ్యవహరిస్తున్న పోలీసులను వదిలేది లేదు: ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

ప్రభుత్వ వైఫల్యాలను, జగన్‌రెడ్డి దోపిడీని సామాజిక మాధ్యమాల్లో ఎండగడుతున్న వారిపై సీఐడీ పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ధ్వజమెత్తారు. వైకాపా అరాచకాలపై పోరాటం చేస్తున్నందుకే చింతకాయల అయ్యన్నపాత్రుడు, విజయ్‌లను వైకాపా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. వైకాపా తొత్తుల్లా వ్యవహరిస్తున్న పోలీసులను వదిలేది లేదని హెచ్చరించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ విజయ్‌ ఇంటికి వెళ్లిన సీఐడీ పోలీసులు ఆయన కుటుంబ సభ్యుల్ని, చిన్న పిల్లల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఇంట్లో పనివాళ్లను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఈ తరహా అరెస్టులు ప్రజాస్వామ్య విరుద్ధమని హైకోర్టు ఎన్నోసార్లు చెప్పింది. జగన్‌ ప్రభుత్వం న్యాయస్థానాల ఆదేశాలను పాటించడం లేదు. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి తను చెప్పిందే వేదం అన్నట్లు జగన్‌ ప్రవర్తిస్తున్నారు. విజయ్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోవడానికి వీల్లేదని కోర్టు చెప్పింది. అయినా పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారంటే.. ఇంతకంటే అన్యాయం ఉంటుందా?

బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని భయపెడుతున్నారు: మద్దిపాటి వెంకటరాజు

‘‘జగన్‌ ప్రభుత్వం బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని భయపెట్టాలని చూస్తోంది. పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తడంలో లీనమైపోయారు. చింతకాయల విజయ్‌ను అక్రమంగా అరెస్టు చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను బెదిరించాలని చూడడం దారుణం. పరిధి దాటి ప్రవర్తించిన వారంతా చట్టం ముందు చేతులు కట్టుకొని నిలబడక తప్పదు’’ అని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది: డూండి రాకేశ్‌

చింతకాయల విజయ్‌తో వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేశ్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోని పోలీసులు.. తెదేపా నేతలను మాత్రం వేధిస్తున్నారని శనివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.

* సీఐడీ పోలీసులు విజయ్‌ ఇంట్లోకి దోపిడీ దొంగల్లా ప్రవేశించడం దుర్మార్గమని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు మండిపడ్డారు. జగన్‌ చెప్పినట్టల్లా చేస్తే భవిష్యత్తులో సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ పొరుగు రాష్ట్రాలకు పారిపోక తప్పదని శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని