విజయ్‌ ఇంట్లోకి దొంగల్లా చొరబడ్డ సీఐడీ పోలీసులు

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు, తెదేపా యువ నేత చింతకాయల విజయ్‌ ఇంట్లోకి పోలీసులు దోపిడీ దొంగల్లా చొరబడ్డారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విజయ్‌ ఇంట్లోని చిన్నపిల్లలు, పనివాళ్లను భయభ్రాంతులను చేసేలా సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని ధ్వజమెత్తారు.

Updated : 02 Oct 2022 07:19 IST

అయిదేళ్ల చిన్నారినీ భయపెట్టే నీచస్థితికి జగన్‌ సర్కారు

నోటీసులివ్వడానికి వెళ్తే.. డ్రైవర్‌పై దాడి చేయడం ఎందుకు?

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు, తెదేపా యువ నేత చింతకాయల విజయ్‌ ఇంట్లోకి పోలీసులు దోపిడీ దొంగల్లా చొరబడ్డారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విజయ్‌ ఇంట్లోని చిన్నపిల్లలు, పనివాళ్లను భయభ్రాంతులను చేసేలా సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని ధ్వజమెత్తారు. అయిదేళ్ల చిన్నారినీ పోలీసులతో భయపెట్టించే  నీచమైన స్థితికి జగన్‌రెడ్డి దిగజారారని శనివారం ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ‘సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకే వస్తే, డ్రైవర్‌పై దాడి చెయ్యడం ఎందుకు? కేసులు, విచారణల పేరుతో జగన్‌రెడ్డి పోలీసులను రౌడీల్లా ప్రతిపక్ష నేతల పైకి ఉసిగొల్పుతున్నారు. బీసీ నేత అయ్యన్నపాత్రుడి కుటుంబంతో మొదటి నుంచీ ఈ ప్రభుత్వం కక్షపూరితంగానే వ్యవహరిస్తోంది. గతంలో నర్సీపట్నంలోని ఆయన ఇంటిపై ఇలానే దాడి చేశారు. రాష్ట్రంలో రోజుకో సీఐడీ కేసు, వారానికో అరెస్టు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పాలి. సీఐడీని అడ్డుపెట్టుకొని పాలన సాగించడం సిగ్గుచేటు’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

జగన్‌రెడ్డి బెదిరింపులకు భయపడం: అయ్యన్నపాత్రుడు

రాష్ట్రంలో పరిపాలనను గాలికొదిలేసిన సీఎం జగన్‌.. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదని, పార్టీ కోసం ఎంత దూరమైనా వెళతామని స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘శని, ఆదివారాలు న్యాయస్థానాలకు సెలవని.. శుక్రవారం వస్తే ఎవరో ఒకరిపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. నా కుమారుడు విజయ్‌పై గతంలో సీఐడీ పోలీసులు కేసు పెడితే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు. మళ్లీ ఇప్పుడెందుకు వేధిస్తున్నారు? హైదరాబాద్‌లోని విజయ్‌ ఇంటి దగ్గర శుక్రవారం నుంచే సీఐడీ పోలీసులు ఉన్నారు. ఉదయాన్నే కారు డ్రైవర్‌ను కొట్టి అపార్టుమెంట్‌లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. విజయ్‌ లేరని కుటుంబసభ్యులు చెబుతున్నా వినకుండా దురుసుగా ప్రవర్తించారు. ఇంటి యజమానులు లేకుండా లోనికి వెళ్లే అధికారం సీఐడీ పోలీసులకు ఎవరిచ్చారు? నోటీసులు ఇవ్వకుండా ఇల్లంతా సోదాలు చేయడం, డ్రైవర్‌ను కొట్టడం, మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పాలని చిన్నారులను బెదిరించడం జగన్‌ రాక్షసత్వానికి అద్దం పడుతోంది. సీఐడీ చీఫ్‌ సునీల్‌కైనా బుద్ధి, ఆలోచనా శక్తి ఉండాలి. రాష్ట్రంలో సీఎం, మంత్రులు సహా అనేక మంది దోపిడీదారులున్నారు. దమ్ముంటే సీఐడీ అధికారులు వారిపై కేసులు పెట్టాలి’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

సీఐడీ పోలీసుల తీరు దారుణం: అనిత

పాయకరావుపేట, నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: తెదేపా నాయకుల పట్ల సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. శనివారం వచ్చిందంటే చాలు ఎవరిని జైలుకు పంపాలా అనే తాపత్రయమే ముఖ్యమంత్రి జగన్‌లో కనబడుతోందని విమర్శించారు. చింతకాయల విజయ్‌కు హైదరాబాద్‌లో నోటీసులివ్వడానికి వెళ్లిన సీఐడీ అధికారుల తీరును నిరసిస్తూ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో శనివారం కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. అంతకు ముందు అనిత, తెదేపా జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, ఎలమంచిలి, చోడవరం నియోజకవర్గాల తెదేపా ఇన్‌ఛార్జులు ప్రగడ నాగేశ్వరరావు, బత్తుల తాతయ్యబాబు తదితరులు అయ్యన్న ఇంటికి వెళ్లి ఆయనను కలిసి మద్దతు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని