రాహుల్‌ పర్యటనలో ‘దేశ విభజన’ రగడ

దేశ విభజనకు నెహ్రూ పితామహులంటూ భాజపా కర్ణాటక శాఖ తీవ్ర విమర్శలకు దిగడం రాజకీయ వేడిని పెంచింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కొనసాగిస్తున్న భారత్‌ ఐక్యత యాత్ర

Updated : 02 Oct 2022 06:13 IST

ఈనాడు, బెంగళూరు: దేశ విభజనకు నెహ్రూ పితామహులంటూ భాజపా కర్ణాటక శాఖ తీవ్ర విమర్శలకు దిగడం రాజకీయ వేడిని పెంచింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కొనసాగిస్తున్న భారత్‌ ఐక్యత యాత్ర రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో... భారత్‌ నుంచి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు విడిపోవడానికి నెహ్రూ, జిన్నాలే కారణమని భాజపా స్థానిక పత్రికల్లో ప్రకటనల రూపంలో ప్రచారం చేసింది. నెహ్రూ మనవడు అధికారంలోకి వస్తే భారత్‌ను ఎలా ఐక్యం చేస్తారని ప్రశ్నించింది. ఈ తీరుపై ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా స్పందిస్తూ చరిత్రను వక్రీకరించే వారి భావజాలం ఎప్పుడూ వక్రంగానే ఉంటుందన్నారు. 1937లో అహ్మదాబాద్‌లో సావర్కర్‌ నేతృత్వంలో నిర్వహించిన హిందూ మహాసభలోనే దేశ విభజనపై తీర్మానం చేశారని ఆరోపించారు. లాహోర్‌ 1942లో జరిగిన సమ్మేళనంలో ఇదే తీర్మానాన్ని జిన్నా పునరావృతం చేశారన్నారు. ముస్లింలీగ్‌తో చేతులు కలిపిన హిందూ మహాసభ చేసిన విభజన తీర్మానాన్ని ప్రతిసారీ కాంగ్రెస్‌ వ్యతిరేకించిందన్నారు. ఇదే సందర్భంగా కర్ణాటక విపక్ష నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ... ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకులు హెడ్గేవార్‌, మాధవ్‌ సదాశివరావ్‌లు ఎప్పుడైనా భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారా? అంటూ ప్రశ్నించారు.

అవినీతిపై నోరు మెదపరా? 

కర్ణాటక ప్రభుత్వంలో ప్రతి పనికీ ‘40% కమీషన్‌’ రాజ్యమేలుతోందని సర్కారు పనులు చేసే గుత్తేదారుల సంఘం లేఖ రాసినా ప్రధాని మోదీ నోరుమెదపలేదని ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కమీషన్‌ దందాను అడ్డుకోవాలని రెండుసార్లు లేఖ రాసినా ప్రధాని, ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేదన్నారు. ఇదే తరహా కమీషన్‌పై 13 వేల పాఠశాలల సమాఖ్య కూడా ఆరోపణలు చేసిందని ప్రస్తావించారు. రాష్ట్రంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నా భర్తీ చేయకుండా నిరుద్యోగాన్ని పెంచుతున్నారని మండిపడ్డారు. పోలీస్‌ ఎస్‌ఐ, కేపీఎస్‌సీ నియామకాల్లో అక్రమాలు కొనసాగుతున్నా ఏలికలు చూస్తూ ఊరుకున్నారని తప్పుబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని