ఏకాభిప్రాయానికి ప్రయత్నించా..

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు ఏకాభిప్రాయంతో పూర్తి కావాలని తాను ప్రయత్నించినా సీనియర్‌ నేత శశిథరూర్‌ మాత్రం పోటీనే కోరుకున్నారని ఈ రేసులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోటీ అవసరమని థరూర్‌ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారని తెలిపారు.

Published : 03 Oct 2022 02:43 IST

నేను నెగ్గితే గాంధీ కుటుంబం సలహాలు స్వీకరిస్తా: ఖర్గే

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు ఏకాభిప్రాయంతో పూర్తి కావాలని తాను ప్రయత్నించినా సీనియర్‌ నేత శశిథరూర్‌ మాత్రం పోటీనే కోరుకున్నారని ఈ రేసులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోటీ అవసరమని థరూర్‌ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారని తెలిపారు. పార్టీ అధ్యక్షునిగా తాను ఎన్నికైతే గాంధీ కుటుంబంతో, ఇతర సీనియర్‌ నేతలతో సంప్రదింపులు జరిపి, వారు చెప్పిన మంచి విషయాలు ఆచరిస్తానని చెప్పారు. అలాగని తాను గాంధీ కుటుంబ మద్దతు ఉన్న అధికారిక అభ్యర్థిని కాదని స్పష్టంచేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జి-23 అంటూ కాంగ్రెస్‌లో వేరే శిబిరమేమీ ఇప్పుడు లేదనీ, భాజపాపై పోరాడడానికి నేతలంతా ఒక్కటై తనకు మద్దతు ఇస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్‌ని బలోపేతం చేసేందుకే ఎన్నికల బరిలోకి దిగాననీ, ఎవరినో ఎదిరించడానికి కాదని స్పష్టంచేశారు. భాజపా ఎన్నడూ సంస్థాగత ఎన్నికలు నిర్వహించలేదనీ, అలాంటిది తమపై అనవసర విమర్శలు చేస్తోందని తప్పుపట్టారు. దళిత నేతగా కాకుండా ఒక కార్యకర్తగా తాను పోటీ చేస్తున్నానని, థరూర్‌ తనకు సోదరుడితో సమానమని పేర్కొన్నారు.

యువ గళాన్ని వినాల్సిన సమయమిది: థరూర్‌

కాంగ్రెస్‌ పార్టీలోని యువ గళాన్ని వినాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ అధ్యక్ష బరిలో నిలిచిన ఎంపీ శశిథరూర్‌ అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మార్చేందుకు నాయకత్వం కృషి చేస్తుందని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని