మండలిని రద్దుచేస్తామంటూ బెదిరించారు

బిల్లులు ఆమోదం పొందకుండా చేసినందుకు, తమను బెదిరించడానికి పాలకులు మండలిని రద్దుచేస్తామని చెప్పారని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తెలిపారు. అలా చేసినా నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటామని పేర్కొన్నారు.

Published : 03 Oct 2022 03:08 IST

ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన యూటీఎఫ్‌

ఈనాడు, అమరావతి: బిల్లులు ఆమోదం పొందకుండా చేసినందుకు, తమను బెదిరించడానికి పాలకులు మండలిని రద్దుచేస్తామని చెప్పారని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తెలిపారు. అలా చేసినా నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటామని పేర్కొన్నారు. వచ్చేఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్‌ మద్దతిస్తున్న పీడీఎఫ్‌ అభ్యర్థుల పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. సామాజిక ఉద్యమాల్లో ఉంటూ, మచ్చలేని వారిని అభ్యర్థులుగా ప్రకటించామన్నారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులు కాపాడాలన్నా, నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నా.. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దుచేసి, ఓపీఎస్‌ చేయాలా? లేకపోతే జీపీఎస్‌ను అంగీకరించాలా? అనేదానిపై త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగే ఎన్నికలను రెఫరెండంగా భావించాలని కోరారు.

* ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పి.బాబురెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎం.వెంకటేశ్వరరెడ్డి, ఉమ్మడి కడప, కర్నూలు అనంతపురం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కత్తి నర్సింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల నాగరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె.రమాప్రభకు యూటీఎఫ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని