రాజధానిని రావణకాష్ఠం చేసిన వైకాపా

‘రాష్ట్రాన్ని రాజధాని పేరుతో రావణకాష్ఠం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పిన జగన్‌.. ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు.

Published : 03 Oct 2022 03:08 IST

రాష్ట్రంలో నరహంతక పాలన సాగుతోంది

ఎయిమ్స్‌కు నీళ్లివ్వకుంటే ఉద్యమమే

ప్రజాపోరు ముగింపు సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-గవర్నర్‌పేట: ‘రాష్ట్రాన్ని రాజధాని పేరుతో రావణకాష్ఠం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పిన జగన్‌.. ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. భూములిచ్చిన రైతులు వెయ్యి రోజులుగా ఉద్యమిస్తుంటే.. వారికి పోటీగా వైకాపా వారితో ధర్నాలు చేయిస్తున్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి, ప్రజలను అయోమయానికి గురి చేస్తూ దౌర్భాగ్య రాజకీయాలకు పాల్పడుతున్నారు’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ‘ప్రజాపోరు’ కార్యక్రమం ముగింపు సభను విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో ఆదివారం రాత్రి నిర్వహించారు. సభలో వీర్రాజు మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ ఆంధ్రా రాజధాని అమరావతిలోనే ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే విజయవాడలో పైవంతెనలు నిర్మించారు. మచిలీపట్నానికి జాతీయ రహదారి ఇచ్చారు. కృష్ణా నదిపై బైపాస్‌ రోడ్డు మంజూరు చేశారు. రూ.8.16 లక్షల కోట్లతో ఏపీని అభివృద్ధి చేస్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు? నచ్చని వారిని జైలులో పెట్టడం తప్ప!’ అని మండిపడ్డారు. ఇటీవల విజయవాడలో ఓ నాయకుడి కన్ను తీశారని, రాష్ట్రంలో నరహంతక పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు.

‘ప్రజలను వర్గాల వారీగా విభజించే కుట్రకు వైకాపా పాల్పడుతోంది. రూ.800 కోట్లతో కేంద్రం ఎయిమ్స్‌ను నిర్మిస్తే, దానికి కనీసం మంచినీళ్లు ఇవ్వడం లేదు. కేంద్ర ఆరోగ్య మంత్రి వచ్చి అడిగితే నీళ్లిస్తామని చెప్పారు. ఈ నెల 10లోగా ఇందుకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలి. లేదంటే భాజపా ఉద్యమిస్తుంది’ అని వీర్రాజు హెచ్చరించారు. ‘కేంద్రం నిధులతో అమలయ్యే పథకాలకు జగన్‌ బొమ్మ వేసుకుంటున్నారు. కేంద్రం అంగన్‌వాడీ కేంద్రాలకు ఇచ్చే నాణ్యమైన పాలప్యాకెట్లు, పౌష్టికాహారంపై తన బొమ్మ వేసుకుంటున్న జగన్‌.. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే చిన్నసైజు కోడిగుడ్లపై మాత్రం వేసుకోవడం లేదు. రాష్ట్రంలో తయారుచేసి, అమ్మే బూమ్‌బూమ్‌ బీర్‌ సీసాలపై కూడా జగన్‌ బొమ్మ వేసుకోవాలి. రూ.15 వ్యయం అయ్యే సీసాను రూ.250కు అమ్ముతున్నారు. తాను ముఖ్యమంత్రినైతే దశలవారీగా మద్యనిషేధం విధిస్తానని చెప్పిన జగన్‌.. ఆ మాటే మరిచారు’ అని విమర్శించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరును తొలగించడానికి మీరెవరని వీర్రాజు ప్రశ్నించారు.

మేం అధికారంలోకి వస్తే..
‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ భాజపా ప్రభుత్వం ఏర్పడాలి. అప్పుడే పోలవరం, రాజధాని సాకారమవుతాయి. ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తాం. సర్పంచులకు ఆర్థిక సంఘం నిధులు అందేలా చూస్తాం. నాణ్యమైన సన్నబియ్యం ఇస్తాం. రెండు యూనిట్లు ఉండే లారీ ఇసుక రూ.4వేలకు, ట్రాక్టర్‌ ఇసుక రూ.1,500కు అందిస్తాం. మొక్కల పెంపకం బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తాం. గుంతలు పూడ్చే పనిని ఐటీఐ, సివిల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా చదివిన వారికి అప్పగిస్తాం. మహిళా సంఘాలతో కోళ్లఫారాలు పెట్టించి, అంగన్‌వాడీల ద్వారా నాటు గుడ్లు అందిస్తామ’ని వీర్రాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని