వైకాపా పాలనలో గాంధీ ఆత్మ క్షోభిస్తోంది

వైకాపా పాలకుల తీరుతో గాంధీ ఆత్మ క్షోభిస్తోందని తెదేపా నాయకులు మండిపడ్డారు. అహింసా విధానాలకు తిలోదకాలిచ్చిన జగన్‌.. రాష్ట్రంలో హింసా మార్గాన్ని అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు.

Published : 03 Oct 2022 03:46 IST

స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు

తెదేపా నాయకుల ఆరోపణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా పాలకుల తీరుతో గాంధీ ఆత్మ క్షోభిస్తోందని తెదేపా నాయకులు మండిపడ్డారు. అహింసా విధానాలకు తిలోదకాలిచ్చిన జగన్‌.. రాష్ట్రంలో హింసా మార్గాన్ని అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామ స్వరాజ్యానికి ఆయువుపట్టు లాంటి స్థానిక సంస్థల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో పల్లెల్లో అభివృద్ధి అటకెక్కిందని దుయ్యబట్టారు. గాంధీ జయంతి సందర్భంగా.. తెదేపా నాయకులు, సర్పంచులు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా గాంధీ చిత్రపటాలకు, విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేసి, పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం పంచాయతీ నిధులు స్వాహా చేసి సర్పంచులకు గౌరవం లేకుండా చేసిందని మండిపడ్డారు. ‘సుమారు రూ. 7,660 కోట్ల ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించింది. తక్షణం వాటిని పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాలను, వాలంటీర్లను పంచాయతీల్లో విలీనం చేయాలి. ఉపాధి హామీ పనులను, నిధులను పంచాయతీల ఆధీనంలోకి తీసుకురావాలి.’ అని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, అనగాని సత్యప్రసాద్‌, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా బాధ్యులు పాల్గొన్నారు.

‘తెలుగు ప్రొఫెషనల్స్‌ వింగ్‌’ వార్షికోత్సవం
ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా అనుబంధ విభాగమైన తెలుగు ప్రొఫెషనల్స్‌ వింగ్‌ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. గతేడాది అక్టోబరు 2న తెదేపా అధినేత చంద్రబాబు ప్రారంభించిన ఈ విభాగం పార్టీకి, నాయకులకు ఎనలేని సేవలను అందిస్తోందని నాయకులు తెలిపారు. పార్టీని సామాన్య ప్రజానీకానికి చేరువ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో మాజీమంత్రి దేవినేని ఉమా, గౌతు శిరీష, టీపీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు తేజశ్వీ పొడపాటి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని