CM KCR: మునుగోడు నుంచే ‘జాతీయ’ పోరు

విజయదశమి నాడు మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ ఏర్పాటును ప్రకటిస్తామని, దానికి బీఆర్‌ఎస్‌ తదితర పేర్లను పరిశీలిస్తున్నామని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. 5వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో 283 మంది సభ్యులు జాతీయ పార్టీ ఏర్పాటును ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేస్తారని, అనంతరం పార్టీ పేరును ప్రకటిస్తామని వివరించారు. 

Updated : 03 Oct 2022 06:46 IST

డిసెంబరు 9న దిల్లీలో సభ

దసరా రోజున పార్టీ ప్రకటన

పార్టీ పేరు మారుతుంది.. గుర్తు కారే

భాజపాను గద్దె దించడమే ప్రథమ లక్ష్యం

మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: విజయదశమి నాడు మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ ఏర్పాటును ప్రకటిస్తామని, దానికి బీఆర్‌ఎస్‌ తదితర పేర్లను పరిశీలిస్తున్నామని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. 5వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో 283 మంది సభ్యులు జాతీయ పార్టీ ఏర్పాటును ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేస్తారని, అనంతరం పార్టీ పేరును ప్రకటిస్తామని వివరించారు.  భాజపాయే తమ ప్రధాన శత్రువని, ఆ పార్టీని గద్దె దించడమే మొదటి లక్ష్యమని పేర్కొన్నారు. వచ్చే మునుగోడు ఉప ఎన్నికల్లో జాతీయ పార్టీగానే పోటీ చేస్తామని స్పష్టతనిచ్చారు. డిసెంబరు 9న దిల్లీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రులు, 33 జిల్లాల పార్టీ అధ్యక్షుల సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తొలిసారిగా బహిరంగంగా వెల్లడించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. జాతీయ పార్టీ ఏర్పాటు అవసరం, కసరత్తు, కార్యాచరణ, ప్రభావాలు, పరిణామాలు, ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు.

దేశం మనవైపు చూస్తోంది

‘‘ప్రస్తుతం దేశ ప్రజల దృష్టి తెరాసపైనే ఉంది. భాజపా దుర్మార్గపు పాలనతో దేశం అధోగతి పాలైంది. ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ విఫలమైంది. ఈ నేపథ్యంలో దేశం యావత్తూ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తోంది. భాజపాను దెబ్బతీసే పార్టీ తెరాసనే అని అందరూ గుర్తించారు. దేశంలోని ఇతర పార్టీల నేతలు, మేధావులు, శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, రైతు నేతలు, మీడియా సంస్థల అధిపతులు.. ఇలా ప్రతి ఒక్కరూ మన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తెరాసగా తెలంగాణను సాధించడంతో పాటు రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపాం. దేశాన్ని ఇదే తరహాలో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దేశ పౌరునిగా భారత్‌ను ఉజ్వలంగా, అఖండంగా మార్చే యజ్ఞంలో ప్రధాన పాత్ర పోషించాలి. ఇందులో పార్టీ శ్రేణులు కీలకపాత్ర పోషించాలి. జలదృశ్యంలో మొదలైన చిన్న సమావేశం తెలంగాణ గతిని మార్చింది. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. ఇప్పుడు భాజపా వంటి పార్టీలకు గుణపాఠం చెప్పి దేశంలో గుణాత్మక మార్పు సాధించడానికి ముందడుగు వేస్తోంది.

పేరు మార్పిడే..

కేంద్ర ఎన్నికల సంఘంతో, న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకొని ముందడుగు వేస్తున్నాం. కొత్తగా జాతీయస్థాయి పార్టీ ఏర్పాటు చేస్తే సాంకేతిక సమస్యలు వస్తాయి. అందుకే తెరాసకే జాతీయ పార్టీగా పేరు మారుస్తున్నాం. పేరు మార్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకొని ఆమోదం పొందుతాం. గతంలో జనసంఘ్‌, అన్నాడీఎంకే, టీఎంసీలు ఇలాగే జాతీయ పార్టీ హోదా పొందాయి. జాతీయ పార్టీకి కారు గుర్తు యథాతథంగా ఉంటుంది. గులాబీ రంగు జెండాయే ఉంటుంది. మధ్యలో తెలంగాణ బదులు భారతదేశ పటం ఉంటుంది. దసరా రోజు మంచి ముహూర్తం ఉన్నందున అదే రోజు పార్టీని ప్రకటించాలని నిర్ణయించాం. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, గ్రంథాలయ సంస్థల ఛైర్‌పర్సన్లు అంతా కలిసి 283 మంది సభ్యులం ఉన్నాం. అందరూ తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి రావాలి. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు తమిళనాడు, మహారాష్ట్రల నుంచి కొన్ని పార్టీల నేతలు, దిల్లీ, యూపీల నుంచి రైతు నేతలు ముఖ్యఅతిథులుగా హాజరవుతారు. జాతీయ పార్టీగా తెరాస మార్పుపై తీర్మానం చేస్తాం. మధ్యాహ్నం 1.19 గంటలకు అధికారికంగా ప్రకటిస్తాం. ఆ తర్వాత ప్రగతిభవన్‌కు వెళ్లి భోజనాలు చేసి.. అక్కడి నుంచి మీరు నియోజకవర్గాలకు వెళ్లి దసరా ఉత్సవాల్లో పాల్గొనాలి.

అంతా శుభసూచకమే

జాతీయ పార్టీగా మారాక ఎలాంటి గందరగోళం ఉండదు. మనకు అంతా శుభసూచకమే. దీంతో ఏమీ కాదనే కొన్ని పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దు. చాలా పార్టీలు మనతో విలీనమయ్యేందుకు ముందుకొస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా మనకు బ్రహ్మరథం పడతారు. ఆప్‌ లాంటి పార్టీ కొద్దికాలంలోనే దిల్లీతో పాటు పంజాబ్‌లో అధికారంలోకి వచ్చింది. మనం దానికన్నా సీనియర్లం. సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎక్కడికి వెళ్లినా గుర్తింపు లభిస్తుంది. మునుగోడు ఉప ఎన్నికకు జాతీయ పార్టీ పేరిటే పోటీ చేస్తాం. మునుగోడులో ఈసారి మూడు జాతీయ పార్టీలుంటాయి. మనదే వంద శాతం విజయం. ప్రజలంతా మనవైపే ఉన్నారు. మన సర్వేతో పాటు విపక్షాల సర్వేలు సైతం మన గెలుపును ధ్రువీకరిస్తున్నాయి. 

విస్తృతంగా పర్యటించేందుకే విమానం కొనుగోలు

జాతీయ పార్టీ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో బహిరంగ సభలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను వీలైనన్ని ఎక్కువ చోట్ల నిర్వహిస్తాం. డిసెంబరు 9న దిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. దానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తాం. మన ఎజెండాను ప్రకటిస్తాం. నేను విస్తృతంగా పర్యటిస్తాను. అందుకే సొంత విమానం కొనుగోలు చేస్తున్నాం. తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు, దళితబంధు, పింఛన్లు, రైతులకు ఉచిత విద్యుత్‌ లాంటి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తాం.

మీకూ బాధ్యతలు

జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత మీతో పాటు తెరాస నేతలకు గురుతర బాధ్యతలు ఉంటాయి. మీలో చాలామందిని పార్టీ రాష్ట్రాల ఇన్‌ఛార్జీలుగా నియమిస్తాం. అక్కడికి వెళ్లి పార్టీ శాఖలతో కలిసి పనిచేయాలి. పార్టీ విస్తరణకు కృషి చేయాలి. మీరందరూ అన్ని విధాలా సహకారాన్ని అందించాలి. జాతీయ పార్టీపై విస్తృత ప్రచారం చేయాలి’’ అని కేసీఆర్‌ సూచించారు.

జిల్లా అధ్యక్షుల ఏకగ్రీవ మద్దతు

జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే తెరాస జిల్లా అధ్యక్షులు, మంత్రులు అందరూ జై కేసీఆర్‌, జై తెలంగాణ, జైభారత్‌ అని నినాదాలు చేస్తూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని