తెలుగు పార్టీ దేశంలో దుమ్మురేపుతది

‘‘తెలుగు సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాయి. దేశంలో దుమ్మురేపుతున్నాయి. అచ్చం అదే విధంగా త్వరలోనే తెలుగు పార్టీ కూడా భారత దేశంలో దుమ్మురేపేందుకు సిద్ధమై ఉంది. ఆ రోజు కూడా తొందరలో వస్తుంది.

Updated : 03 Oct 2022 07:31 IST

 అచ్చం మన పాన్‌ ఇండియా సినిమాల లెక్కనే దూసుకుపోతుంది

జాతీయ పార్టీ ఏర్పాటుపై కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈనాడు, కరీంనగర్‌: ‘‘తెలుగు సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాయి. దేశంలో దుమ్మురేపుతున్నాయి. అచ్చం అదే విధంగా త్వరలోనే తెలుగు పార్టీ కూడా భారత దేశంలో దుమ్మురేపేందుకు సిద్ధమై ఉంది. ఆ రోజు కూడా తొందరలో వస్తుంది. దీనికి ప్రజలంతా మద్దతు, ఆశీర్వాదాన్ని అందించాలి’’ అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో కళోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కార్యక్రమాల్ని ప్రారంభించి.. మూడున్నర గంటలపాటు ప్రదర్శనల్ని తిలకించారు. కళాకారుల్ని సన్మానించారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్‌ కీలక పాత్ర పోషించిందన్నారు.  త్వరలోనే పార్టీని పెట్టి దుమ్ము దులుపుదామా.. అంటూ ప్రశ్నించి సభికుల నుంచి సమాధానాల్ని రాబట్టారు. ‘‘ఇదే కరీంనగర్‌ వేదికగా నాటి సింహగర్జన సభతో, ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ కల సాకారమైంది. సీఎం కేసీఆర్‌ తీసుకున్న తాజా సంచలన నిర్ణయం ఏదైతే ఉందో.. అది కూడా దుమ్మురేగాలి. ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా’’ అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఉద్యమంలో కేసీఆర్‌ మాట ఎంత పవర్‌ఫుల్లో.. కళాకారుల పాట కూడా అంతే బలమైనదని కేటీఆర్‌ అన్నారు. ‘‘ఒక్కప్పుడు తెలంగాణ భాష అంటే పట్టించుకోని పరిస్థితుల నుంచి.. ఇప్పుడు తెలంగాణ యాస లేకుంటే సినిమాలు హిట్టు కాలేని పరిస్థితులకొచ్చాయనేది మన కళాకారుల అభిప్రాయం. తెలంగాణలో కళాకారులను ప్రభుత్వం ఆదరిస్తుంది. ఉద్యమంలో పాల్గొన్న సమయంలో పాటలు పాడిన 574 మందికి తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగాల్ని అందించాం. అజ్ఞాతసూర్యులుగా వేలమంది ఉన్నారు. వారందరికి తాము గౌరవమిచ్చేలా కళోత్సవాలను నిర్వహిస్తాం. కరీంనగర్‌లో మంత్రి గంగుల నిర్వహించినట్లే అన్ని జిల్లాలతోపాటు రాష్ట్ర రాజధానిలో ఇలాంటి వేదికలను ఏర్పాటు చేస్తాం’’ అని కేటీఆర్‌ వివరించారు. జాతీయ పార్టీ ఏర్పాటు తరువాత తొలిసభను కరీంనగర్‌లో నిర్వహించాలని తీర్మానం చేస్తున్నామని మంత్రి గంగుల కేటీఆర్‌కు తెలిపారు. కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, రవిశంకర్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts