కేంద్ర ప్రభుత్వం కంటే భాజపానే చురుగ్గా ఉంది

భారతీయ జనతా పార్టీ వెంటనే తన పేరు మార్చుకోవాలని, భారతీయ జనా ఈసీ-సీబీఐ-ఎన్‌ఐఏ-ఐటీ-ఈడీ పార్టీగా ప్రకటించుకోవాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ఆదివారం ట్విటర్‌లో సూచించారు.

Updated : 03 Oct 2022 05:14 IST

పేరు మార్చుకుంటే బాగుంటుంది

ట్విటర్‌లో కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

ఈనాడు, హైదరాబాద్‌ : భారతీయ జనతా పార్టీ వెంటనే తన పేరు మార్చుకోవాలని, భారతీయ జనా ఈసీ-సీబీఐ-ఎన్‌ఐఏ-ఐటీ-ఈడీ పార్టీగా ప్రకటించుకోవాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ఆదివారం ట్విటర్‌లో సూచించారు. కేంద్ర ప్రభుత్వం కంటే భాజపానే వేగంగా పనిచేస్తోందని, అన్ని రహస్యాలను ముందే చెబుతోందని, దిశానిర్దేశం చేస్తోందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ఎన్నికల సంఘం కంటే ముందే భాజపా ఎన్నికల తేదీని ప్రకటిస్తుందని, సోదాలు చేసే వారి పేర్లు ఈడీ కంటే ముందే వెల్లడిస్తుందని, ఎన్‌ఐఏ కంటే ముందే నిషేధం విధిస్తుందని, ఆదాయపన్ను అధికారుల కంటే ముందే నగదు వివరాలు చెబుతుందని, సీబీఐ కంటే ముందే నిందితుల పేర్లు భాజపా ప్రకటిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రకటన 15లోగా వస్తుందని.. 5 అంచెల వ్యూహంతో భాజపా విజయం సాధించాలని భాజపా స్టీరింగ్‌ కమిటీ భేటీలో ఆపార్టీ జాతీయ కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆయన ఈ ట్వీట్‌ చేశారు.

* మిషన్‌ భగీరథకు కేంద్ర పురస్కారంపై ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ), జల్‌జీవన్‌ మిషన్‌ వంటి కేంద్రమంత్రిత్వ శాఖలు తప్పుడు ప్రచారాలను విస్తృతంగా వ్యాపింపచేయడం సిగ్గుచేటని ఆయన మరో ట్వీట్‌లో విమర్శించారు.

* జాతిపిత మహాత్మాగాంధీ ఆదర్శాలు, భావజాలం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని కేటీఆర్‌ ట్విటర్‌లో తెలిపారు. గాంధీ 153వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని