సంక్షిప్త వార్తలు (10)

కిష్టరాయిన్‌పల్లి, చర్లగూడెం జలాశయాల కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పరిహారం, పునరావాసం కల్పించకుండా వారిని అడ్డా కూలీలుగా మార్చిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

Updated : 04 Oct 2022 06:42 IST

భూ నిర్వాసితులను అడ్డా కూలీలుగా మార్చారు

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శ

నాంపల్లి, న్యూస్‌టుడే: కిష్టరాయిన్‌పల్లి, చర్లగూడెం జలాశయాల కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పరిహారం, పునరావాసం కల్పించకుండా వారిని అడ్డా కూలీలుగా మార్చిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార రెండోవిడత యాత్రలో భాగంగా సోమవారం ఆయన నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. అంబేడ]్కర్‌ పేరు చెప్పుకొని ఆధిపత్య వర్గాల నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. దశాబ్దాలుగా మునుగోడు నియోజకవర్గంలో కనీస వసతులపై దృష్టి పెట్టని నాయకులు ఇప్పుడు ఏ కారణం చెప్పి ప్రజలను ఓట్లడుగుతారని ప్రశ్నించారు.


ఎవరి సొమ్ముతో విమానం కొంటున్నారు?

సీఎం కేసీఆర్‌కు షర్మిల ప్రశ్న

చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాంతాన్ని అప్పుల కుప్ప చేశారని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తాకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడి మహిళలతో కలిసి షర్మిల బతుకమ్మ ఆడారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో దోచుకున్నది సరిపోకనే సీఎం కేసీఆర్‌ దేశాన్ని ఏలడానికి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. విమానం కొనేందుకు ఎవరి సొమ్మును ఖర్చు పెడుతున్నారని సీఎంను ప్రశ్నించారు.  


మునుగోడు బీసీల అభ్యర్థిగా డా.శేషగిరిరావుగౌడ్‌


 

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీసీ సామాజిక వర్గానికి చెందిన డా.ఈడా శేషగిరిరావుగౌడ్‌ను బీసీల తరఫు అభ్యర్థిగా వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు ప్రకటించాయి. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సదరన్‌ పొలిటికల్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయా సంఘాల నేతలు ఈ మేరకు ప్రకటించారు. రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు వీజీఆర్‌ నారగోని, ఎంబీసీ వ్యవస్థాపకుడు సంగెం సూర్యారావు, వివిధ సంఘాల నేతలు ప్రొ.గాలి వినోద్‌కుమార్‌, ప్రొ.అన్వర్‌ఖాన్‌, డా.చొప్పర శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలి: తమ్మినేని

ఈనాడు, హైదరాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను నెలకొల్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం  డిమాండ్‌ చేశారు. ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని  పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. అక్కడి ఇనుప ఖనిజం నాణ్యంగా లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడం అభివృద్ధిని అడ్డుకునే కుట్రేనని ఆరోపించారు.


ములాయం ఆరోగ్యంపై కేసీఆర్‌, కేటీఆర్‌ల ఆరా

ఈనాడు, హైదరాబాద్‌: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పార్లమెంట్‌ సభ్యుడు ములాయంసింగ్‌ యాదవ్‌ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు సోమవారం ఆరా తీశారు. ములాయం తనయుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌కు కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేశారు. అఖిలేశ్‌తో మాట్లాడి ములాయం ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. దసరా పండగ తర్వాత వచ్చి కలుస్తానని అఖిలేశ్‌కు కేసీఆర్‌ తెలిపారు. కేటీఆర్‌ కూడా అఖిలేశ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ములాయం కోలుకోవాలని ఆకాంక్షించారు


మునుగోడు టికెట్‌ బీసీలకే ఇవ్వాలి..

తెరాసకు పది సంఘాల డిమాండ్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: మునుగోడు ఉపఎన్నికకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో.. తెరాస తరఫున బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే టికెట్‌ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. తెరాస జాతీయ పార్టీగా అవతరిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా బలపడాలంటే సామాజిక న్యాయం ప్రధాన ఎజెండాగా ఉండాలని, దానికి మునుగోడు నుంచే శ్రీకారం చుట్టాలని పది బీసీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈమేరకు తెలుగు వర్సిటీ సమీపంలోని ఓ హోటల్‌లో సోమవారం ఆయా సంఘాలు నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో 65% బీసీల జనాభా ఉందని, ఈసారి బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా గెలిపించుకొని, ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామని అన్నారు.  


విశ్వాస పరీక్షలో నెగ్గిన పంజాబ్‌ సర్కారు

చండీగఢ్‌: విశ్వాస పరీక్షలో భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని పంజాబ్‌ సర్కారు నెగ్గింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎమ్మెల్యేలు 91 మందితో పాటు మరో ఇద్దరు కూడా ప్రభుత్వంపై విశ్వాసాన్ని ప్రకటించడంతో 93 ఓట్లతో తీర్మానం నెగ్గింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందంటూ విశ్వాస తీర్మానాన్ని ముఖ్యమంత్రి గత నెల 27న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఓటింగుకు కాంగ్రెస్‌ దూరంగా నిల్చొంది. భాజపా దీనిని బహిష్కరించింది. ప్రజల విశ్వాసాన్ని డబ్బుతో కొనలేరన్న వాస్తవాన్ని తాజా పరీక్ష రుజువు చేసిందని మాన్‌ వ్యాఖ్యానించారు.


అధ్యక్ష అభ్యర్థుల తరఫున ప్రచారానికి మార్గదర్శకాలు
కాంగ్రెస్‌ కార్యవర్గ నేతలు పాల్గొనడంపై నిషేధం

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున పార్టీ కార్యవర్గ నేతలు (ఆఫీస్‌ బేరర్స్‌) ఎవరూ ప్రచారంలో పాల్గొనడానికి వీల్లేదని ఏఐసీసీ స్పష్టంచేసింది. ఒకవేళ ప్రచారం చేయాలని ఎవరైనా అనుకుంటే ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. అభ్యర్థులు ప్రచారం కోసం ఆయా రాష్ట్రాలకు వస్తున్నప్పుడు ప్రతినిధులతో వారు సమావేశమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలే గానీ పీసీసీ అధ్యక్షులు నేరుగా ఈ సమావేశాలను వ్యక్తిగత స్థాయిలో నిర్వహించకూడదని తెలిపింది. ‘‘ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు/బాధ్యులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ విభాగాల అధిపతులు, అధికార ప్రతినిధులు... వీరిలో ఎవరూ కూడా అధ్యక్ష బరిలోని అభ్యర్థులకు అనుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ ప్రచారం చేయకూడదు’’ అని పేర్కొంది.


సర్పంచులను బిచ్చగాళ్లను చేసిన ప్రభుత్వం: తులసిరెడ్డి

ఈనాడు-అమరావతి: ఏపీలో జగన్‌ ప్రభుత్వం సర్పంచులను బిచ్చగాళ్లను చేసిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఆరోపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విధులు, నిధులు, అధికారాలు బదిలీచేయాలి.. అలాంటి ప్రయత్నం చేయకపోగా కేంద్ర ఆర్థిక సంఘం పంచాయతీలకు విడుదల చేసిన నిధులను కూడా దారి మళ్లించింది’ అని ఆయన శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు


పార్టీ వ్యవహారాల గురించి శశిథరూర్‌కు తెలియదు: వీహెచ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు క్షేత్రస్థాయిలో పార్టీ వ్యవహారాల గురించి ఖర్గేకు తెలిసినంతగా తెలియదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు పేర్కొన్నారు. ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖర్గేను బహిరంగ చర్చకు రావాలనడం మంచి సంస్కృతి కాదన్నారు. నామినేషన్‌ వేసేటప్పుడు తనకు తెలపలేదని, హైదరాబాద్‌ వచ్చినప్పుడూ చెప్పలేదని.. అందుకే థరూర్‌ను కలవలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు..

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని