3 పార్టీలకూ ముఖ్యమే

ముక్కోణపు పోరుకు మునుగోడు సిద్ధమైంది. ఎన్నికల తేదీ ప్రకటనతో అన్ని పార్టీల్లో సందడి పెరిగింది. 2023 శాసనసభ ఎన్నికల ముందు జరగనున్న కీలక ఉప ఎన్నిక కావడంతో తెరాస, కాంగ్రెస్‌, భాజపాలు దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.

Updated : 04 Oct 2022 10:06 IST

ఎన్నికల తేదీ ప్రకటనతో ఇక మరింత వేగం

ఈనాడు, హైదరాబాద్‌, నల్గొండ: ముక్కోణపు పోరుకు మునుగోడు సిద్ధమైంది. ఎన్నికల తేదీ ప్రకటనతో అన్ని పార్టీల్లో సందడి పెరిగింది. 2023 శాసనసభ ఎన్నికల ముందు జరగనున్న కీలక ఉప ఎన్నిక కావడంతో తెరాస, కాంగ్రెస్‌, భాజపాలు దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. పోటాపోటీ కార్యకలాపాలు, ఇతర పార్టీల నేతల చేరికలు, మోహరించిన ముఖ్యనేతలతో మునుగోడులో ఇప్పటికే రాజకీయ సందడి కొనసాగుతోంది. తెరాస, భాజపా అగ్రనేతల తొలివిడత సభలు ఇప్పటికే పూర్తికాగా కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు సభలు, సమావేశాలను నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. భాజపా అభ్యర్థిగా రాజగోపాల్‌ రెడ్డి బరిలో ఉంటారు. తెరాస అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సీపీఐ, సీపీఎంలు ఆ పార్టీకి మద్దతు ప్రకటించాయి. బీఎస్పీ పోటీచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ ఇప్పటికే ప్రకటించారు.

ఆరు నుంచి తెరాస నేతలు అక్కడే..

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నెల ఆరో తేదీ నుంచి తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడులో ప్రచారంలోకి దిగుతారు. ప్రచారపర్వం ముగిసే వరకు అక్కడే మకాం వేస్తారు. తెరాస ఇప్పటికే వంద ఓటర్లకో ఇన్‌ఛార్జిని నియమించి ఇంటింటి ప్రచారం నిర్వహించింది. మంత్రులు, ఉమ్మడి నల్గొండ నేతలు ఇప్పటికే ముమ్మర ప్రచారం చేస్తున్నారు. దళితబంధు, గిరిజనబంధు పథకాలపై పార్టీ సమావేశాలు చేపట్టింది. హైదరాబాద్‌లోని బంజారాభవన్‌కు మునుగోడు గిరిజనులతో యాత్రలు చేయించింది. అన్ని గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించింది. అభ్యర్థిని ఖరారు చేయకున్నా తెరాస ప్రచారాన్ని తీవ్రస్థాయిలో ముందుకు తీసుకెళ్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌  బహిరంగ సభను నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. 

ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భాజపా

మునుగోడులో ఎలాగైనా పాగా వేయాలని భాజపా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఈ ఎన్నికపై ఆసక్తిని కనబరుస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బహిరంగసభలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను వీడినప్పటి నుంచి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ వ్యవహారాలపైనే దృష్టిపెట్టారు. కాంగ్రెస్‌, తెరాస ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడానికి యత్నిస్తున్నారు. మాజీ ఎంపీ వివేక్‌ నేతృత్వంలోని స్టీరింగ్‌ కమిటీ ఎన్నికల కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. గ్రామాల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ప్రచారం నుంచి ఓటింగ్‌ వరకు బాధ్యత నిర్వహించేలా బూత్‌స్థాయి బాధ్యులను నియమించింది. ఇతర జిల్లాల ముఖ్యనేతలు కూడా ఇప్పటికే  ప్రచారంలో పాల్గొంటున్నారు.

గడపగడపకూ వెళ్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి

గత ఎన్నికల్లో నెగ్గిన మునుగోడు స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించింది. సిటింగ్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అనంతరం చండూరు సభతో కార్యకర్తలు, నేతలకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించింది. వివిధ సందర్భాల్లో మునుగోడు వేదికగా  కార్యక్రమాలను నిర్వహించింది. హుజూరాబాద్‌లో ఆలస్యంగా అభ్యర్థిని ఎంపిక చేయడంతో నష్టం జరిగినందున ఈసారి ముందస్తుగానే కసరత్తు పూర్తి చేసింది. సుమారు నెల క్రితమే అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించింది. దీంతోపాటు పార్టీ టికెట్‌ కోసం పోటీపడిన నాయకులను సముదాయించింది. సీనియర్‌ నాయకులకు ఇన్‌ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించింది.అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే ప్రచారాన్ని ప్రారంభించిన స్రవంతి గడప గడపకూ వెళ్తున్నారు. అయితే ఇప్పటికీ పలువురు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు భాజపా, తెరాసల్లో చేరుతుండటం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా కాంగ్రెస్‌ ముఖ్యనేత, మాజీ మంత్రి ఆర్‌.దామోదర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆయనను కలసి ప్రచారానికి రావాలని ఆహ్వానించారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని