ఏఐసీసీ ఎన్నిక.. కుటుంబ వ్యవహారం

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక కాంగ్రెస్‌ కుటుంబ వ్యవహారమని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్‌ స్పష్టం చేశారు. తమ చర్చంతా ‘భాజపాను ఎలా ఎదుర్కోవాలి’ అనే అంశంపైనే సాగుతుందని ఆయన తేల్చిచెప్పారు.

Published : 04 Oct 2022 03:38 IST

భాజపాను ఎదుర్కోవడంపైనే దృష్టి

కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక కాంగ్రెస్‌ కుటుంబ వ్యవహారమని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్‌ స్పష్టం చేశారు. తమ చర్చంతా ‘భాజపాను ఎలా ఎదుర్కోవాలి’ అనే అంశంపైనే సాగుతుందని ఆయన తేల్చిచెప్పారు. ఏఐసీసీ ఎన్నికల ప్రచార నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన శశిథరూర్‌ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ నాయకులతోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో వేర్వేరుగా కొందరిని కలవబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మౌలిక విషయాల్లో తనది, ప్రత్యర్థి మల్లికార్జున ఖర్గేది ఒకే అభిప్రాయమని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు శక్తిమంతులు అనేదే ప్రధాన ప్రశ్న అన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఖర్గే దళిత నాయకుడు మాత్రమే కాదని, ఆయన గొప్పనేత అని, తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని శశిథరూర్‌ తెలిపారు. నిష్పాక్షిక ఎన్నికకు గాంధీ కుటుంబం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్‌లో జీ-23 అనేది లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనను ఇంటికి రావాలని ఆహ్వానించినా వెళ్లలేకపోయినట్లు తెలిపారు. ఆయన పిలిస్తే తప్పక గాంధీభవన్‌కు వెళ్లి ప్రచారం చేసుకుంటానన్నారు. మరోవంక.. హైదరాబాద్‌కు వచ్చిన శశిథరూర్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు దూరంగా ఉన్నారు.

రేపటి గురించి ఆలోచించు...

ఈ సందర్భంగా వివిధ అంశాలతో కూడిన ఏఐసీసీ ఎన్నికల ప్రణాళికను శశిథరూర్‌ విడుదల చేశారు. ‘రేపటి గురించి ఆలోచించు...థరూర్‌ గురించి ఆలోచించు’ నినాదంతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం పాత్రను పునఃసమీక్షించాలి, పార్టీ ప్రధాన విశ్వాసాలను పునరుద్ధరించాలి, యువతపై దృష్టిపెంచాలి తదితర అంశాలను అందులో పేర్కొన్నారు.

పోటీ నుంచి థరూర్‌ తప్పుకోవాలి: డా.చింతా మోహన్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఏఐసీసీ అధ్యక్ష పోటీ నుంచి శశిథరూర్‌ తప్పుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డా.చింతా మోహన్‌ సూచించారు. మల్లికార్జున ఖర్గే వివాద రహితుడని, రెండు వారాల్లో ఆయన కొత్త అధ్యక్షుడు కానున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని