ఉప ఎన్నిక వేళ రాష్ట్రంలోనే రాహుల్‌

మునుగోడు ఉప ఎన్నిక వేళ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రలో భాగంగా 13 రోజులపాటు రాష్ట్రంలో ఉండనున్నారు. ఈ నెల 24 రాష్ట్రంలో యాత్ర ప్రారంభం కానుంది. నవంబరు 5న మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది.

Updated : 04 Oct 2022 06:34 IST

తెలంగాణలో 13 రోజులపాటు సాగనున్న భారత్‌ జోడో యాత్ర

ఈనాడు-హైదరాబాద్‌, గాంధీభవన్‌-న్యూస్‌టుడే: మునుగోడు ఉప ఎన్నిక వేళ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రలో భాగంగా 13 రోజులపాటు రాష్ట్రంలో ఉండనున్నారు. ఈ నెల 24 రాష్ట్రంలో యాత్ర ప్రారంభం కానుంది. నవంబరు 5న మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక నవంబరు 3న జరగనుంది. ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ రాష్ట్రంలో ఉంటుండటం పార్టీకి ఉపకరిస్తుందని నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఎన్నికల కోసం శంషాబాద్‌ ప్రాంతంలో ప్రత్యేకంగా బహిరంగ సభ నిర్వహించే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని రాజీవ్‌గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ యాత్ర నిర్వాహకులు దిగ్విజయ్‌ సింగ్‌, జైరాం రమేశ్‌, కొప్పుల రాజు తదితరులు హాజరవుతారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న వీరికి శంషాబాద్‌ విమానాశ్రయంలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బోసురాజు తదితరులు స్వాగతం పలికారు.

నగరం నడిబొడ్డు నుంచే..

రాష్ట్రంలో 13 రోజుల పాటు జరిగే యాత్ర హైదరాబాద్‌ నగరం నడిబొడ్డు నుంచే వెళ్లనుంది. ఆరాంఘర్‌, చార్మినార్‌, నాంపల్లి, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మియాపూర్‌ పటాన్‌చెరు మీదుగా సంగారెడ్డిలోకి ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో చార్మినార్‌, పరిసర ప్రాంతాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం పరిశీలించారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని కృష్ణా నది నుంచి కొత్తూర్‌ వరకు యాత్ర సాగే మార్గాన్ని ప్రత్యేక పరిశీలకుడు సుశాంత్‌ మిశ్ర, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం తదితరులు పరిశీలించారు.

* మునుగోడు ఉప ఎన్నికపై మంగళవారం గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు సమీక్షించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని