మోదీ సూచనలతోనే కేసీఆర్‌ చర్యలు: రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియ సహా ఆయన చర్యలన్నీ ప్రధాని మోదీ సూచనలతోనే జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 04 Oct 2022 06:29 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియ సహా ఆయన చర్యలన్నీ ప్రధాని మోదీ సూచనలతోనే జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మోదీని మూడోసారి ప్రధానిని చేయడానికి తెరాస.. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడానికి భాజపా పరస్పర అవగాహనతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌కు నిజంగానే మోదీని ఓడించాలనుకుంటే ఎన్డీయేలో నుంచి భాగస్వామ్య పక్షాలను బయటకు తీసుకురావాలన్నారు. జాతీయ పార్టీ పేరుతో యూపీఏ భాగస్వామ్య పక్షాలను చీల్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌, మోదీ ఇద్దరూ కలిసి కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ కారణంగానే కేసీఆర్‌పై ఉన్న ఈఎస్‌ఐ, సహారా ఇండియా కేసుల్లో ఇంతవరకు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదన్నారు.

రాహుల్‌గాంధీ యాత్రకు భయపడి ఈడీతో వేధింపులు

రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు భయపడి ఈడీ అధికారులతో భాజపా వేధింపులకు గురిచేస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలో డీకే శివకుమార్‌కు, తెలంగాణలో గీతారెడ్డి, షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, గాలి అనిల్‌కుమార్‌లకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఒక అవకాశమివ్వాలని ఆ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస, భాజపా గెలిచినా ఎలాంటి మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణలో గుణాత్మక మార్పు తీసుకొస్తామన్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారందర్నీ సమానంగా గౌరవిస్తానని.. అనుకోని కార్యక్రమాలు ఉండటం వల్లే శశిథరూర్‌ను కలవలేకపోయానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని