TRS: సత్వరమే తెరాస పేరు మార్పు!

తెలంగాణ రాష్ట్రసమితిని కొత్తపేరుతో జాతీయ పార్టీగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. దసరా పండుగను దీనికి ముహూర్తంగా పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Updated : 04 Oct 2022 10:49 IST

రేపే ప్రకటన.. 6న ఈసీ వద్దకు..

వెంటనే కొత్త పేరు అమల్లోకి వచ్చే అవకాశం

రేపటి విస్తృత సమావేశానికి తెరాస సన్నాహాలు

283 మందికి ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితిని కొత్తపేరుతో జాతీయ పార్టీగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. దసరా పండుగను దీనికి ముహూర్తంగా పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆరో తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి అఫిడవిట్‌ సమర్పిస్తే.. 29ఎ-9 సబ్‌క్లాజ్‌ కింద ఈసీ దాన్ని వెంటనే ఆమోదిస్తుందని, అదే రోజు లేదా ఏడో తేదీ నుంచి పార్టీ కొత్తపేరు అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు సన్నాహకంగా.. దసరా రోజు (బుధవారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుంది. దీనికి హాజరు కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించారు. మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడినందున కొంత సందిగ్ధత ఏర్పడగా.. దాని ప్రభావం పార్టీ సర్వసభ్య సమావేశంపై ఉండదని కేసీఆర్‌ తమ నాయకులకు స్పష్టం చేశారు. నిర్దేశిత సమయానికి తెలంగాణభవన్‌కు చేరుకోవాలని సూచించారు. తెరాస విస్తృతస్థాయి సమావేశం కోసం సభ్యులైన 283 మందిని ఆహ్వానించారు. ఈ సమావేశంలో .. జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్‌ ప్రసంగిస్తారు. అనంతరం తెరాస పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చేస్తూ ఏకవాక్య తీర్మానం చేస్తారు. దీన్ని సభ్యుల మద్దతు అనంతరం ఆమోదిస్తారు. మధ్యాహ్నం 1.19 ముహూర్తానికి ఆయన జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారు. అనంతరం పార్టీ ఆశయాలు, లక్ష్యాలను వివరిస్తారు. జెండాను విడుదల చేస్తారు.

* జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పురి వద్ద సముద్రతీరంలో తెరాస నేత అలిశెట్టి అరవింద్‌ కేసీఆర్‌ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించారు.  జైభారత్‌, జై కేసీఆర్‌, జై బీఆర్‌ఎస్‌, దేశ్‌కీ నేత కేసీఆర్‌, కిసాన్‌ భరోసా అని నినాదాలు రాయించారు.


రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు

జాతీయ పార్టీ ప్రకటన వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేయాలని తెరాస అధిష్ఠానం శ్రేణులకు సూచించింది. ర్యాలీలు, ప్రదర్శనలు, బాణసంచాల పేలుళ్లతో ఉత్సవాలు నిర్వహించాలని నిర్దేశించింది. తెలంగాణభవన్‌తో పాటు హైదరాబాద్‌లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అధ్యక్షతన హైదరాబాద్‌ నగర పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. దీనికి మంత్రులు తలసాని, మహమూద్‌అలీ హాజరయ్యారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనూ వేడుకలు జరపనున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని